అయిదు ప్రశ్నలు
- B Ashok Kumar
- Jun 11, 2018
- 2 min read

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ మానవుడికి వివేకాన్ని, విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదించాడు. తాత్కాలిక సిరిసంపదల వ్యామోహంలో మునిగిన మనిషి తాను సర్వస్వతంత్రుడనని, ఎవరి అక్కర లేనివాడనని మితిమీరి ప్రవర్తిస్తున్నాడు. తనకు ఇంతటి తెలివితేటలు ఎలా కలిగాయన్నది గుర్తించక దైవాన్ని విస్మరించి మనిషి కృతఘ్నుడవుతున్నాడు.
ప్రపంచంలో ఉత్తమ కార్యాలు, దుష్కార్యాలను చేసిన ఉభయులూ మరణించిన తరవాత కలిసేది మట్టిలోనే. ముంచుకు వస్తున్న ప్రళయదినాన తీవ్రమైన అగ్నిగుండాల్లో కొందరు చిక్కుకుంటారు. పూర్తి తీవ్రతతో భూమి కదలబారినప్పుడు మానవులు చెల్లాచెదురై దీపపు పురుగుల మాదిరిగా మారిపోతారని పవిత్ర ఖురాన్ గ్రంథం హెచ్చరిస్తోంది. యావత్ జీవితంలో చేసిన పనులే మనిషికి అదృష్ట సౌభాగ్యాల సోపానాలవుతాయి.
ప్రళయ దినాన ప్రతి మనిషికీ అయిదు ప్రశ్నలు ఎదురవుతాయని మహాప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) ప్రబోధించారు. ‘జీవితం ఏ పనుల్లో గడచింది, యౌవన శక్తిసామర్థ్యాలు ఏ పనుల్లో వినియోగమయ్యాయి, ధనం ఎక్కడి నుంచి ఎలా సంపాదించావు, ఎక్కడ ఏ మార్గంలో ఖర్చు చేశావు, జ్ఞానాన్ని ఎంతవరకు ఆచరణలో పెట్టావు?’- ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగేలా పారదర్శకంగా జీవితాలను మలచుకోవడం అల్లాహ్ విశ్వాసుల ఉత్తమ లక్షణం.
బతికినంత కాలం ఎలా బతకాలన్నది పెద్ద ప్రశ్న. నీవు ప్రపంచంలో పరదేశిలా లేదా బాటసారిలా జీవించు. సత్కార్యాలు చేసి సత్ఫలాలు సమకూర్చుకో. జీవితకాలంలో మృత్యుకాలం కోసం సదాచరణలను సమాయత్తపరచుకో అని ప్రవక్త (స.అ.వ.) బోధించారు.
‘మేము కౌసర్‌ను ప్రసాదించాం. నీవు నీ ప్రభువు కొరకే నమాజుచెయ్యి. ఖుర్బానీ ఇవ్వు. నీకు శత్రువులే ఉండరు’ (అల్ కౌసర్) అని ఘనమైన రాత్రివేళ అవతరించిన పవిత్ర ఖురాన్ గ్రంథం ప్రజలకు స్పష్టమైన ధర్మబోధ చేసింది. అల్లాహ్ అద్వితీయుడు, నిరాపేక్షాపరుడు, ఎవరి ఆధారం, అక్కర లేనివాడు. ఆయనకు సంతానం ఎవరూ లేరు. ఆయన కూడా ఎవరి సంతానం కాదు. అల్లాహ్‌కు సరిసమానులెవ్వరూ లేరు (అల్‌ఇఖ్లాస్) అని గ్రంథం వివరించింది. ఆ అల్లాహ్ ఆరాధనతో పునీతులై పుణ్యాలు ప్రోది చేసుకోవాలి. పవిత్ర రమదాన్ మాసంలో అల్లాహ్ ప్రసన్నతకై ఉపవాసాలు ఉండటమే కాక అనాథలను అక్కున చేర్చుకోవాలి. బీదవారింట పండుగ పరిమళాలు వ్యాపింపజేయాలి. దివ్యాంగులకు రెట్టింపు సేవ చేయాలి. క్షమాపణ అడగాల్సి వచ్చేలా ఏ పరుషవాక్కునూ పలుకరాదు. నోరుజారి ఆపై పశ్చాత్తాపం చెందడం విశ్వాసుల లక్షణం కాదు.
తనకు కలిగిన దానిపట్ల, స్వీయ శక్తిసామర్థ్యాలపై మనిషి తృప్తి చెందాలి. ధర్మబద్ధంగా జీవించాలి. దైవసంతోషానికి కారణమయ్యే ప్రతిదీ సత్కార్యం. అల్లాహ్ పవిత్రతను కొనియాడటం దినచర్యలో భాగం కావాలి. అల్లాహ్ మానవుడికిచ్చిన ప్రాతినిధ్యానికి అంతరార్థం- ఏ విధమైన ఆచరణ ప్రదర్శిస్తారో చూడాలని! విశ్వసించినవారికీ లోకం చెరసాల వంటిది, అవిశ్వాసులకు స్వర్గం లాంటిదని ప్రవక్త స.అ.వ. వ్యాఖ్యానించేవారు. నిత్యమేది, సత్యమేది... వాటిమధ్య భేదమేదో తెలుసుకున్న మనిషి సంపూర్ణ జ్ఞానిగా అల్లాహ్ ముందు తీర్పు రోజున నిలుస్తాడు. ప్రశాంతంగా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చి ప్రసన్నత పొందగలడు. అజ్ఞానంతో సమయం వృథా చేసుకొన్న మనిషి- ‘అయ్యో... నా జీవితంలో ముందుగా కొంత సామగ్రిని ఏర్పాటు చేసుకొని ఉంటే ఎంత బాగుండే’దని విచారించినా లాభం లేదు.
రోగపీడితులను, బాధాతప్త హృదయాలను చూసి జాలిపడితే సరిపోదు- వారిని పరామర్శించి, పలుకరించినా అది దైవకార్యమవుతుంది. మానవత్వం మంటకలుస్తున్న ఈ రోజుల్లో దైవప్రసన్నత కోసం చేసే కార్యక్రమాలు మొక్కుబడిగా ముగుస్తున్నాయి. పాపాలు సమసిపోయేలా, అల్లాహ్ మన్నింపు కోరే అర్హత పొందేలా బాధ్యతాయుతంగా విశ్వాసం ప్రకటిస్తూ మరణానంతరం స్వర్గప్రాప్తి కలిగేలా మనుగడ సాగించాలి. అందుకు అవసరమైన ధైర్యాన్ని, దృఢ నిశ్చయాన్ని అల్లాహ్ అనుగ్రహించాలని పవిత్ర రమదాన్ మాసంలో ప్రార్థిద్దాం.
Comments