గుణసంపద
- B Ashok Kumar
- Jun 11, 2018
- 2 min read

దేవ, అసుర, మానవ- అని గుణాలు మూడు విధాలు. వాటిని భగవద్గీతతో పాటు పలు పురాణాలు, నారద భక్తిసూత్రాలు విపులీకరించాయి. ‘అణాల కన్నా గుణాలు మిన్న’ అని సామెత. ‘ధనం కంటే గుణం గొప్పది’ అంటారు పెద్దలు. విలువలన్నీ గుణగణాలపైనే ఆధారపడి ఉంటాయి.
దేవతలు పుణ్యక్షేత్రాలు, తీర్థాల్లో ఉంటారని ప్రాచీన గాథలు చెబుతాయి. సాధారణ జనం పల్లెసీమల్లో, మునులు ఆశ్రమాల్లో, దానవులు వారి తావుల్లో వసిస్తుంటారు. సామాన్యుల్ని కాపాడేందుకు, మునుల అభిమతాల్ని నెరవేర్చేందుకు, దేవతలకు ఆనందం కలిగించేందుకు భగవంతుడు అవతారం ధరిస్తుంటాడు.
రాక్షస సంహారానికి శ్రీరాముడు అవతరించాడు. మరో యుగంలో సన్మార్గుల రక్షణ, దుర్మార్గుల శిక్షణ కోసం శ్రీకృష్ణుడి అవతరణ అవసరమైంది. ఏ కాలంలోనైనా మనిషిలోని లక్షణాలతో పాటు పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మంచితనం, చెడ్డతనం బయటపడుతుంటాయి. సంహారానికి బదులు సంస్కరణే ధ్యేయంగా దైవీశక్తుల కార్యాచరణ ప్రస్ఫుటమవుతుంటుంది.
వ్యక్తిలో సభ్యత, సంస్కారం, సుగుణ సంపద నెలకొనాలి. అప్పుడే జాతి సంస్కరణ, పురోగతి వేగవంతమవుతాయి. జాలి, దయ, కరుణలే మనిషికి సహజ స్వభావాలు. ఇతరుల కష్టాన్ని తనదిగా భావించడం, పరోపకారమే లక్ష్యంగా జీవించడం అతడి విధ్యుక్త ధర్మాలు. పావురాన్ని కాపాడేందుకు తన శరీరభాగం నుంచి మాంసాన్ని కోసి ఇచ్చాడు శిబి చక్రవర్తి. మృత్యువునైనా లెక్కచేయకుండా, తనకు సహజసిద్ధంగా లభించిన కవచ కుండలాల్ని కర్ణుడు దానం చేశాడు. వారి గుణసంపద అంత గొప్పది.
ఎదుటివారి కష్టనష్టాల్ని చూసి చలించే వ్యక్తి, వారి సేవలో నిమగ్నుడవుతాడు. సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడు. దానికి విరుద్ధంగా- అన్నీ తనకే కావాలన్న స్వార్థం, సంకుచితత్వం పతనానికి దారితీస్తాయి. ఎవరూ తన స్థాయికి ఎదగకూడదనే ఈర్ష్య, అసూయ, ద్వేషం అతణ్ని అధోగతికి చేరుస్తాయి.
అడవిలో ఒక చెట్టుమీద పావురం, అదే చెట్టు మొదట్లో గండుచీమ ఉంటుండేవి. ఒకరోజున వేటగాడు ఆ పావురాన్ని చంపాలని విల్లు ఎక్కుపెట్టాడు. గమనించలేని అది, అదే స్థితిలో కూర్చొని ఉంది. పావురం ప్రాణాన్ని కాపాడేందుకు చీమ సిద్ధపడింది. సరిగ్గా బాణం విడిచే సమయానికి, అతడి పాదాన్ని చటుక్కున కుట్టింది. వేటగాడి గురి తప్పింది. పావురం ఎగిరిపోయి ప్రాణం కాపాడుకుంది.
తనకు ప్రాణదానం చేసిన చీమకు సహాయపడాలని పావురం తపించింది. ఒక రోజున వర్షం నీటిలో కొట్టుకుపోతున్న చీమను రక్షించాలని ముందుకొచ్చింది. ఒక ఆకును తుంచి, దాని ముందు పడేసింది. అందువల్ల చీమ ప్రాణాలు నిలిచాయి. ఇలాంటి పరస్పర సహకారం అందరికీ శ్రేయోదాయకం!
‘నీవు, నేను వేరు’ అని కాకుండా ‘మనమిద్దరం ఒకటే’ అనేది మనుషుల్ని సంఘటితపరుస్తుంది. ‘నీకిది, నాకది’ వంటి పెడబుద్ధికి బదులు ‘మనందరికీ ఇది’ అనే ఐకమత్యమే జాతిని సదా రక్షిస్తుంది.
దుర్మార్గాన్ని తొలగించాలి. సంస్కరణ మార్గమే ఏ జాతికైనా శిరోధార్యం. ఉత్తమ వ్యక్తిత్వం కలిగినవారు సంఘ సంస్కరణే ధ్యేయంగా తమవంతు కృషి సాగిస్తున్నారు. అది మహోద్యమంగా సాగినప్పుడే, దేశం పురోగమిస్తుంది. మంచితనం, మానవత్వం వికసిస్తే- ఆ పరిమళాలు దేశమంతటా వ్యాపిస్తాయి.
సమాజ సేవే సర్వేశ్వర సేవ!
コメント