అంతర్యాగం
- B Ashok Kumar
- Jun 11, 2018
- 2 min read

పుణ్యక్షేత్రాలు, ఆలయాలపట్ల మనమెంతో భక్తి ప్రపత్తులు కలిగి ఉంటాం. వ్యయ ప్రయాసలకోర్చి స్వామిని దర్శిస్తాం. మన కోరికలు స్వామికి విన్నవిస్తాం- అదీ మనసులోనే. అంటే స్వామి మనలో కొలువై ఉన్నాడన్నమాట. అంతఃకరణ, అంతరంగం, అంతర్యామి, అంతర్యాగం- సుపరిచితంగా అనిపించే ఈ పదాలు మనసుకు సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని సూచిస్తాయి. మనసు అనే అంతరంగంలో వసించేవాడు అంతర్యామి. నాలోనే ఉండి నాకు గోచరించకుండా నన్ను నియంత్రించేవాడు. కంటికి కనపడకుండానే కంటికి చూసే శక్తిని ఇచ్చేవాడు. బుద్ధికి గోచరించకుండా బుద్ధిని ప్రేరణ చేసేవాడు. చెవులకు వినపడకుండానే వినికిడి శక్తిని ఇచ్చేవాడు. ఇంద్రియాలను నడిపిస్తూ ఇంద్రియాలకు గోచరించని జ్ఞానజ్యోతి అంతర్యామి.
‘నాలో వెలుగుతున్న అంతర్యామిని తెలుసుకోవడానికి నాకన్నా భిన్నంగా ఒక పరమాత్మ ఉన్నాడు’ అని మనసులో భావించి ఆ పరమాత్మకు నామరూపాలు కల్పన చేసి ఆరాధన చేయాలి.
సాధన అంటే పూజ గదికి, దైవ మందిరానికి మాత్రమే పరిమితం కాదు. పూజ, హోమం, జపం మాత్రమే కాదు. అది ఒక జీవన విధానం. సంఘంలో సాధకుడు అంతర్భాగం. సంఘంలో ఉంటూ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించాలి. మానవ సేవ, మాధవ సేవను సమాన దృష్టితో స్వీకరించాలి. మనసులోని మాలిన్యంతోపాటు సమాజంలోని మాలిన్యాలను తొలగించడానికి కృషి చేయాలి. కీర్తికాంక్షలు వదిలి సేవాభావనలో సంతృప్తి పొందాలి. ఫలాపేక్ష లేని సేవలో ఆనందం ఉన్నదన్న సత్యాన్ని గ్రహించాలి. తెలియకుండా మనసులో పెరుగుతున్న అసూయ, ద్వేషం అనే శత్రువులను అనుక్షణం గమనిస్తూ జాగరూకుడై ఉండాలి. ప్రేమ, కరుణతో హృదయం నిండిపోవాలి. తద్వారా మనో, బుద్ధి, చిత్, అహంకారాలతో నిండి ఉన్న అంతఃకరణ శుద్ధి అవుతుంది.
అంతఃకరణ శుద్ధి అయినప్పుడు సాధకుడి అంతరంగంలో పరమాత్మపై భక్తి, శ్రద్ధ, విశ్వాసం మెండుగా ఉంటాయి.
సాధకుడు తన శరీరాన్ని రథంగా, బుద్ధిని సారథిగా భావించి సత్కర్మలు చేస్తాడు. ఇంద్రియాలు అనే గుర్రాలను అదుపు చేయడానికి మనసును కళ్ళెంగా వినియోగిస్తాడు. మనసును దైవం పైన, సన్మార్గం పైన ఉంచి ఇంద్రియ నిగ్రహాన్ని సాధిస్తాడు.
భక్తితో పరమాత్మ తత్వాన్ని ఆకళింపు చేసుకొని ద్వైత భావనతో చేసే ఆరాధన పరాకాష్ఠకు చేరితే సాధకుడి అంతరంగ పూజకు చేరువ అవుతాడు. ఈ స్థితికి చేరిన సాధకుడి హృదయపద్మం ఆసనమవుతుంది. మనసే అర్ఘ్యం అవుతుంది. ప్రాణం ధూపంగా భాసిస్తుంది. అనాహత ధ్వనులు ఘంటానాదమై, మనోచాంచల్యం నృత్యమై, చిత్తం- అలంకరణగా మారుతుంది. అహింస, ఇంద్రియ నిగ్రహం, దయ, క్షమ, జ్ఞానం...ఇవి పూజా పుష్పాలవుతాయి.
అంతరంగ పూజలో చేసే యజ్ఞమే- అంతర్యాగం. సాధకుడి ఆత్మే యజమాని. శ్రద్ధయే- భార్య (ధర్మపత్ని), ఇధ్మం (పుల్లలు) - శరీరం, కోరికలు- ఆజ్యం (నెయ్యి), కోపం- బలిపశువు, హృదయం- బలిపీఠం, తపస్సు- అగ్ని, ప్రాణమే- ఉద్గాత. అహింస, సత్యభాషణలు ఋత్విజులకు ఇచ్చే దక్షిణలు. సాధకుడు తన సర్వస్వాన్ని బ్రహ్మార్పణం చేయడమే పూర్ణాహుతి. ఇదే లయ యోగం.
సాధకుడు చేసే ప్రతి పనీ శివారాధనే. సాధకుడు- తత్వమసి ‘నేను పరమాత్మనై ఉన్నాను’ అనే ఎరుకతో ఉంటాడు. ఈ స్థితికి చేరిన సాధకుడు పరమాచార్యులుగా పరిఢవిల్లుతాడు. ఆచార్యులు అనే మాటకు నిజమైన నిర్వచనంగా లోకం వారిని కీర్తిస్తుంది. వారి బోధనలు ఆచరణీయం.
Comentarios