top of page
  • Black Facebook Icon
  • Black YouTube Icon
  • Black Instagram Icon
  • Black Pinterest Icon

పరమేశ్వరుడి దశావతారాలు

  • Writer: B Ashok Kumar
    B Ashok Kumar
  • Jun 3, 2018
  • 1 min read

Updated: Jun 5, 2018


పరమ శివునికి అనేక నామములు ఉన్నవన్న విషయం మనందరికి తెలిసినదే. కానీ... అడిగిన వెంటనే వరాలిచ్చే భోళా శంకరుడు అయిన పరమ శివునకు కూడా విష్ణుమూర్తి వలె దశావతారములున్నవి. ఒక్కొక్క అవతారము ఒక్కొక్క ప్రయోజనం కలిగి ఉంటుంది. శతరుద్ర సంహితాలలో నందీశ్వరుడు, సనత్కుమారునకు ఈ ఈశ్వరావతారమును వివరిస్తాడు. ఆ అవతారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. శివుని ప్రధమ అవతారము మహాకాలుడు. మహాకాళి ఈ మహాకాలునికి భార్య. వీరిరువురు భక్తులకు భుక్తి, ముక్తిని ఇచ్చుచు వారి కోరికలను నెరవేర్చుచుందురు.


2. ఈశ్వరుని ద్వితీయ అవతారము తారకావతారము. తారకాదేవి ఈయన అర్థాంగి. వీరిని సేవించినవారు భక్తి, ముక్తులతో పాటు సమస్త శుభములను పొందుదురు.


3. ముక్కంటి తృతీయ అవతారము బాలభువనేశ్వరావతారము. బాలభువనేశ్వరి భువనేశ్వరుని అర్థాంగి. ఈ అవతారము సత్పురుషులకు సుఖములను కలిగించును.


4. శంకరుని చతుర్థ అవతారము షోడశ విద్యేశ్వరుడు. షోడశ విద్యేశ్వరి ఇతని ధర్మపత్ని. భక్తులకు సర్వ సుఖములను ప్రసాదించుట ఈ అవతార ప్రాశస్త్యము.


5. మహేశ్వరుని పంచమ అవతారము భైరవావతారము. భైరవి ఇతని భార్య. ఈ భైరవుడు ఉపాసనాపరులకు సర్వ కామ్యములను ఒనగూర్చును.


6. మంజునాధుని ఆరవ అవతారము భిన్నమస్త. ఈతని అర్థాంగి భిన్నమస్తకి. వీరీరువురు భక్తకామప్రదులు.


7. భోళా శంకరుని సప్తమ అవతారము ధూమవంతుడు. ధూమవతి ఇతని భార్య. వీరిరువురు భక్తకాభీష్టప్రదులు.


8. పరమ శివుని అష్టమావతారము బగళాముఖుడు. ఇతని అర్థాంగి బగళాముఖి. ఈమెకే మహానంద అని మరియొక పేరు కూడా కలదు. వీరు భక్తవాంఛాప్రదులు.


9. ఉమామహేశ్వరుని నవమావతారము మాతంగుడు. మాతంగి ఇతని భార్య. వీరీరువురు భక్తుల సర్వకాంక్షలను ఈడేర్చుచుందురు.


10. కైలాసవాసుని దశమావతారము కమలుడు. కమల ఇతని భార్య. వీరిరువురు భక్తపాలకులు. ఈ దశమావతారములు శివశక్తి మతోరభేదః అన్న సిద్ధాంతమును మనకు తెలియబరుచుచున్నవి. వికార రహితులై ఏకాగ్రతతో సేవించినవారికి సమస్త సుఖములు కలిగి సమస్త కోర్కెలు సిద్ధించును.


ఈ అవతారములన్నియు తంత్ర శాస్త్ర గర్భితములు. ఈ దేవతా శక్తులు దుష్టులను దండించుచూ భక్తులకు బ్రహ్మతేజోభివృద్ధిని కలిగించుచుండును. శివ పర్వ దినములందు ఈ అవతారములను స్మరించినచో భక్తులు బ్రహ్మ వర్చస్సు కలవారైన విజయవంతులు, ధనాడ్యులు సుఖవంతులు అవుతారని నందీశ్వరుడు పలికెను.

Yorumlar


PAGE VIEWS

JOIN MY MAILING LIST

Copyright © 2018 AADHYATMIKAM. All rights reserved.

bottom of page