top of page
  • Black Facebook Icon
  • Black YouTube Icon
  • Black Instagram Icon
  • Black Pinterest Icon

ఓ యమునా నేను కనుక ఏమి తినని పక్షంలో...

  • Writer: B Ashok Kumar
    B Ashok Kumar
  • Jun 3, 2018
  • 1 min read

Updated: Jun 5, 2018


ఒకసారి వ్యాసమహర్షి యమునా నదిని దాటడానికి నది ఒడ్డుకు వచ్చాడు. అదే సమయంలో గోపికలు కూడా అక్కడకు వచ్చారు. ఆవలి ఒడ్డుకు చేరి విక్రయించే ఉద్దేశంతోవారు తమతో పాటు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి పట్టుకుపోతున్నారు. కానీ అక్కడ ఒక్క పడవ కూడా లేదు. ఎలా వెళ్లడమా అని అందరూ దిగులుగా ఉన్నారు. అప్పుడు వ్యాస మహర్షి వారితో నాకు చాలా ఆకలి వేస్తుంది అన్నారు. అప్పుడు గోపికలు వారివద్దనున్న పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఆయనకు ఇచ్చారు. వాటినన్నిటిని ఆయన దాదాపు పూర్తిగా తినివేశాడు.


పిదప ఆయన యమునా నదిని ఉద్దేశిస్తూ... ఓ యమునా నేను కనుక ఏమి తినని పక్షంలో, ఈ నీటిని రెండు పాయలుగా చేసి మధ్యలో మాకు దారి ఇవ్వు... మేమందరం ఆ దారిగుండా ఆవలి ఒడ్డుకు చేరుకుంటాం అన్నాడు. వెంటనే నది రెండు పాయలుగా విడిపోయి దారి ఏర్పడింది. వ్యాసుడు, గోపికలు తదితరులు ఆ దారిగుండా ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు.


వ్యాసుడు నేనేమి తినలేదు అనడంలో అర్థం. నేను శుద్దాత్మ స్వరూపాన్ని... అని అర్థం. శుద్దాత్మ నిర్లిప్తమైనది. ప్రకృతికి అతీతమైనది. దానికి ఆకలిదప్పులు, చావుపుట్టుకలు అనేవి ఉండవు. అది అజరం(అంటే వయస్సు పైబడటం లాంటిది ఏదీ లేనిది), అమరం, మేరుపర్వతం లాంటిది(అంటే నిశ్చలమైంది). ఇలాంటి బ్రహ్మజ్ఞానం కలిగినవాడే జీవన్ముక్తుడు. ఆత్మ, దేహం వేరువేరు అని అతడు యదార్థంగా అర్థం చేసుకోగలుగుతాడు. భగవంతుని దర్శించినట్లయితే దేహాత్మభావన మరి ఉండబోదు.


దేహం, ఆత్మలు రెండూ వేరైనవి. కొబ్బరికాయలో నీళ్ళు ఎండిపోయి ఎండుకొబ్బరి తయారైన పిదప కొబ్బరికాయ, కొబ్బరి వేరు వేరు అయిపోతాయి. అప్పుడు కాయను కదిలిస్తే లోపల ఉన్న కొబ్బరి కూడా కదులుతూ ఉంటుంది. అదేవిధంగా ఆత్మ కూడా దేహంలో కదులుతూ ఉంటుంది. విషయాసక్తి అనే నీరు ఎండిపోయినప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మ వేరు, దేహం వేరు అన్న బోధ కలుగుతుంది.


లేత పోకకాయ నుండి వక్కను కానీ, లేత బాదంకాయ నుండి బాదంపప్పును కానీ వేరు చేయలేము. కానీ కాయ పండినప్పుడు వక్క, బాదం పప్పు టెంక నుండి విడివడతాయి. కానీ కాయ పండినప్పుడు లోపలి రసం ఎండిపోతుంది. బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు విషయరసం ఎండిపోతుంది. అటువంటి జ్ఞానం జనించడం ఎంతో కష్టం. ఊరకే నోటితో పలికినంత మాత్రాన బ్రహ్మజ్ఞానం కలుగదు. మహాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది.

Comentarios


PAGE VIEWS

JOIN MY MAILING LIST

Copyright © 2018 AADHYATMIKAM. All rights reserved.

bottom of page