ఉన్నత క్రియ
- B Ashok Kumar
- Jun 11, 2018
- 2 min read

ప్రస్తుత సమాజం ఒడుదొడుకులతో సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఉరుకు పరుగుల జీవనంలో ప్రశాంతత, ఆనందం ఎండమావులవుతున్న వైనం... నిర్హేతుకమైన పోటీ, అనుబంధాలు ఆత్మీయతలు కరవైన సంఘజీవులుగా మారుతున్న పరిస్థితులు- ఇదీ ప్రస్తుత సమాజం. ఆధ్యాత్మిక ఆనందం కోసం వెంపర్లాడితే, ఆ అనుభూతి సైతం అంత సులువుగా లభించడం లేదు. మనం సృష్టించిన డబ్బే మనల్ని పాలిస్తోంది. అశాంతికి ఆవాసమైన ఈ సమాజంలో ఆత్మసంబంధమైన సాధన కష్టతరమైపోతోంది.
అంతర్యామిని చేరుకోవాలన్న తృష్ణ తీరేదెలాగంటే- సాధన ఒక్కటే మార్గమని విజ్ఞులు చెబుతారు. పూర్వం లాగా ఇప్పుడు నైమిశారణ్యాలు, లుంబినీ వనాలు, కామ్యక వనాలు, రుష్యాశ్రమాలు లేవు. ఎక్కడో కాస్త ఏకాంతం, ప్రశాంత పరిసరాలు దొరికినా- భౌతిక లక్ష్యాలు, ఆధ్యాత్మిక భావాల మధ్య మనసు డోలాయమానంగా మారిపోతోంది. అలాంటి పరిస్థితుల్లో, సాధన ఒక సవాలు అవుతుంది.
భారతదేశం కర్మ భూమి. ఈ నేలపై కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళే ఎక్కువ. పూర్వజన్మ సుకృతంవల్ల జ్ఞానం వికసిస్తుందని పురాణ వాంగ్మయాలు చెబుతున్నాయి. పూర్వ జ్ఞానం కలిగినవారికే కాక ఎవరికైనా సాధన సాధ్యమేనన్నది రుషి వాక్కు. ప్రాచ్యలిఖిత గ్రంథం హఠయోగ ప్రదీపిక ఇదే చెబుతోంది. గోరా కుంభార్ అనే కుండలు చేసే సాధారణ వ్యక్తి సాధన వల్ల ఆధ్యాత్మిక జ్ఞానంతో ఔన్నత్యం పొందాడు. నామ్ దేవుగా పూజలందుకొన్నాడు. సాధన అనే క్రియ ఉన్నతమైంది. సాధారణ భక్తిని ఆత్మ స్వరూపత్వంగా మారుస్తుంది. ఎందరికో ఎప్పుడో ఒకసారి ప్రాపంచిక విషయాలపై కొంత నిర్లిప్తత కలుగుతుంటుంది. ఆసక్తి తగ్గుతుంది. ఇదొక విచిత్ర అనుభూతి. ఈ అనాసక్తిని పెంచుకోవాలని సాధకులు అంటారు. ఈ అనుభూతిని మనసులోనే దాచుకోవాలి. ఈ భావాన్ని సదా మననం చేసుకొంటూ చైతన్యం పొందాలని యోగ శాస్త్రం వెల్లడిస్తోంది. ఆధ్యాత్మిక పరిణామానికి ఇదే తొలి మెట్టు.
మనం మన దైనందిన కార్యాలు పూర్తి చేసుకుంటూనే క్రమంగా భవ బంధాలకు దూరంగా ఉండాలి. బాధ్యతలను మాత్రం విస్మరించకూడదు. సాధకుడు పక్షిలా జీవితం గడపాలంటారు. గూడు కట్టుకోవాలి. దాంపత్యం నెరపాలి. పిల్లల్ని కనాలి. పసి పక్షులకు రెక్కలొచ్చేదాకాకష్టపడి ఆహారం సంపాదిస్తూపోషణచేయాలి. రెక్కలొచ్చి పిల్ల పక్షులు ఎగరగలిగాయంటే, వాటిపై అవి పేగు బంధాలు విడనాడతాయి. వాటి దారి వాటిదే... వీటి దారి వీటిదే! అలా సాధకులు ఉండాలంటాడు యోగి వేమన. కారుణ్యం, సంవేదన సాధకుడి జీవితంలో అంతర్భాగం కావాలి. సహచరులను అర్థం చేసుకొనే గుణం సహజంగానే అలవడుతుంది. క్రమంగా మనలో ఏదో శుద్ధ చైతన్యం నడవడికలో, శరీరంలో వ్యక్తమవుతూ ఉంటుంది. సాధన మార్గంలో కంటకాలు తొలగిపోవడం గమనిస్తాం.
మనిషి మర్త్యుడు. ఏదో ఒకనాడు ఈ లోకం విడిచి వెళ్లక తప్పదు. అనివార్యమైనదాన్ని గురించి ఆలోచిస్తూ మనస్తాపం చెందనవసరం లేదు. పరిమితమైన జీవితం వల్ల బతుకెంత విలువైందో తెలుస్తుంది. అందుకే ఆ పరిమిత జీవితకాలాన్ని సార్థకం చేసుకోవాలి.
ప్రతికూల భావాలు కలుగుతూనే ఉంటాయి. నిజానికి ఇలాంటి భావాలు మనల్ని హెచ్చరిస్తుంటాయి. అనుకూల పరిస్థితులు రావటానికి సాధన చేయాలని విజ్ఞులు అంటారు. మనదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మనదైనది ఆత్మ ఒక్కటే. సాధన చేస్తే ఆత్మ ఉన్నతమై ఈ ప్రపంచానికి అతీతమైన అనుభూతులు కలుగుతాయి. ఇవే ఆధ్యాత్మిక మార్గాన్ని సరళం చేస్తాయి. శాశ్వతమైన స్థానం పొందేందుకు మాత్రమే ఈ భూమిపైకి వచ్చామని తెలుస్తుంది. అందుకోసమే ఈ మనుగడను వినియోగించుకోవాలి. ఏదైనా సాధించేందుకు సాధన అవసరం. ఈ సాధనే మనిషికి ఔన్నత్యం కలిగించే ఉన్నత క్రియ!
Comments