కృషి రుషితత్వం
- B Ashok Kumar
- Jun 11, 2018
- 2 min read

యజ్ఞం అంటే వేలిమి. త్యాగబుద్ధితో చేసే లోకహితమైన చర్యలన్నీ యజ్ఞాలే అవుతాయి. మానవులు చేయదగని స్వార్థ క్రియాయోగమే యజ్ఞం. అలా స్వార్థం లేకుండా చేపట్టిన చర్యలు ఇటు జనప్రియ కర్మలుగా, అటు దైవప్రీతి పాత్రమైన సత్కర్మలుగా తగిన ఫలితాలను ప్రసాదిస్తాయి. చిక్కుముడి అక్కడే ఉంది. మానవమాత్రులు ఫలితం ఆశించకుండా ఏ పనినైనా మొదలు పెట్టడానికి ఇష్టపడరు. లాభనష్టాలు బేరీజు వేసుకొని ప్రారంభించిన పని ఫలాసక్తితో చేపట్టిన చర్య అవుతుంది. అలాంటి కామ్యకర్మలు యజ్ఞానికి పనికి రావు. పైగా అలాంటి కర్మలు బంధాలై మోక్షానికి ప్రతిబంధకాలవుతాయి. కర్మఫలం గురించి ఆలోచించకుండా, యజ్ఞ కార్యానికి దోహదం చేసే కర్తవ్యకర్మలు చేపడితే, యోగ్యమైన ఫలితాలు వర్షిస్తాయి. త్యాగముక్తమైన నియతకర్మలను అనుష్ఠించటమే కర్మయోగం. బ్రహ్మ ప్రజలను యజ్ఞంకోసం సృష్టి చేశాడని, వాటి ద్వారా మానవకోటి వృద్ధి పొందుతుందని, అది కామధేనువులా వారి కోరికలను ఈడేరుస్తుందని బ్రహ్మ యజ్ఞాలను సంకల్పించినట్లు గీత(మూడు-10) చెబుతున్నది.
కర్మలు మూడురకాలు. విశుద్ధకర్మ, నిష్కామకర్మ, నిషిద్ధకర్మ. కర్మ, అకర్మ, వికర్మలుగా వీటిని గ్రహించవచ్చు. శాస్త్రసమ్మతమైన కర్మ ఆచరించడం వల్ల దోషాలు అంటవు. విధియుక్తమైన కర్మానుష్ఠానం ధర్మసమ్మతమే. అర్జునుడు యుద్ధం చేయడం అన్నది విధ్యుక్తధర్మమైన కర్తవ్యకర్మ, స్వధర్మం అవశ్యం ఆచరణీయం. అది ఎలాంటిదైనా పరధర్మంకన్నా శ్రేష్ఠమే. ధర్మవ్యాధుడు మాంసం తేవడం, అమ్మడం, అతడి స్వధర్మం. అలా వేట హింసాత్మకమైనా ధర్మసమ్మతమే అవుతుంది. ఫలాభిసంధి రహితంగా చేపట్టే కర్మ మనిషిని మోక్షగామిగా తీర్చిదిద్దుతుంది. కర్మఫలాన్ని వదిలి కర్మతో యోగించినప్పడే ఆ కర్మానుభవం కర్మయోగంగా మారుతుంది. నిషిద్ధకర్మ శాస్త్రవిరుద్ధం కాబట్టి దాన్ని వదిలివేయాలి. కర్మలో విభాగాలున్నట్టుగానే యజ్ఞంలోనూ తేడాలు ఉన్నాయి. ద్రవ్యయజ్ఞంకన్నా, జ్ఞానయజ్ఞం మిన్న. జ్ఞానాగ్ని కర్మలను సమిధల్లా కాల్చి బూడిద చేస్తుంది. కర్మయోగం చివరికి జ్ఞానయజ్ఞంగా పరిణమించి భక్తిరసంలో పరిపుష్టమై కర్మయోగిని జ్ఞాన శిఖరం చేరుస్తుంది. అంచేత, కర్మయజ్ఞం కర్మయోగంలానే మిక్కిలి శ్రేష్ఠం.
వజ్రాన్ని వజ్రంతో ఛేదించే చందంగా, కర్తవ్యకర్మ నిర్వహణ ద్వారా, కర్మఫలాలను ఆ పరమాత్మపరం చేయాలి. అనుమానాలు, భయాలు, ఉద్రేకాలు, ఉద్వేగాలు- ఇలాంటి చాపల్యాలకు దూరమైన మనసు నిలకడగా ఉంటుంది. బుద్ధి వికసిస్తుంది. చిత్తం దైవదత్తమై, అహంకారం అంతరిస్తుంది. ఎప్పుడైతే మనసు, చిత్తం, అహంకారం సాధకుడి వశవర్తిగా మారతాయో- అప్పుడు కర్మ తన ధృతరాష్ట్ర కౌగిలిలో అతణ్ని బంధించలేదు.
మాయాజనితమైన గుణాలు ఈ మానవ శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును మభ్యపెట్టి మనిషిని తమచుట్టూ తిప్పుకొంటూ ఉంటాయి. ఈ సత్యాన్ని తెలుసుకున్న సాధకుడికి కర్మాచరణ ఒక చిద్విలాసంగా, భౌతిక వినోద క్రీడగా కనిపిస్తుంది. కర్మలు చేయకుండా లోకంలో బతకడం సాధ్యం కాదు. వాటిలో తనను అంటే ‘నేను’ అన్న భావన ప్రవేశపెట్టకూడదు. అలాంటి ‘ఎరుక’తో పనులు చేస్తుండటంవల్ల, ఆ సాధకుడు సన్యాసిగా లేక సాంఖ్యయోగిగా గుర్తింపు పొందుతాడు.
కృష్ణపరమాత్మ అర్జునుణ్ని కర్మయోగివి కావాలని ఆదేశించాడు. ఈ జీవితం ఒక వరం. జీవితం ఎడారిగా, అడవి కాచిన వెన్నెలలా వృథా కాకూడదు. మృత్యురూపమైన మర్త్య జీవితంలో అమృతత్వం సాధించడమే జీవిత పరమార్థం. అమృతంతో మన జన్మభూమిని దేవభూమిగా తీర్చిదిద్దడమే పరమగమ్యం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి రెండే మార్గాలు. ఒకటి జ్ఞానమార్గం. రెండోది కర్మమార్గం. ఏది సాధ్యమో నిర్ణయించుకోవలసింది సాధకుడు. ఆపై అందుకు నిరంతరం కృషిచేయాలి.
Commentaires