కర్మసాక్షి
- B Ashok Kumar
- Jun 11, 2018
- 1 min read

‘సూర్యుడు’ అనే పదానికి ప్రజలను పనుల కొరకు ప్రేరేపించేవాడని అర్థం. సూర్యుడి వంశంలో జన్మించినవాడు శ్రీరామచంద్రుడు. రాముడి జీవితంలో దుష్టశిక్షణ, ధర్మ సంరక్షణ విధులు సూర్యుడి ప్రేరణతో ముడివడ్డాయి. శత్రుసంహారకాండ మొట్టమొదటగా తాటకతో ఆరంభించాడు రాముడు. దానికి ముందుగా యాగసంరక్షణకై రాముణ్ని తనవెంట తీసుకెళుతూ విశ్వామిత్ర మహర్షి ‘పూర్వాసంధ్యా ప్రవర్తతే...’ అంటూ సూర్యుడి ప్రస్తావనతోనే రాముణ్ని కర్తవ్యంలోకి మేలుకొల్పాడు.
రాముడి చేతుల్లో చిట్టచివరగా మరణించిన రాక్షస వీరుడు- రావణాసురుడు. రావణ సంహారం నిమిత్తం అగస్త్యమహర్షి ‘ఆదిత్యహృదయం’తోనే రాముణ్ని ఉత్తేజితుణ్ని చేశాడని రామాయణం చెబుతోంది. రాముడి అవతార లక్ష్యసాధనలోని తొలి చివరి అంకాలు ఆ విధంగా సూర్యుడి ప్రమేయంతోనే నెరవేరాయి.
సూర్యుణ్ని స్తుతిస్తూ నూటపది పద్యాలతో భాస్కర శతకాన్ని లోకానికి కానుక చేసిన మారన కవి ‘సూర్యుడే ఈ కవిత్వానికి ప్రేరణ’ అని ప్రకటించాడు. ‘మతం అంటూ ఒకదాన్ని నేను ఎంచుకోవలసివస్తే- లోకానికి వెలుగులు పంచే భాస్కరుణ్ని నా దేవుడిగా చెబుతాను’ అన్నాడు నెపోలియన్... అభిమానంతో కాదు- అవగాహనతోనే. సూర్యుడు జగమంతటికీ ప్రేరణ!
వేదాల్లోని సౌరసూక్తాలు, రామాయణంలోని ఆదిత్య హృదయం- ఈ దేశంలో సూర్యారాధన ఎంత పురాతనమైనదో నిరూపిస్తాయి. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, ఫూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర... అనే 12 చైతన్యాలతో సూర్యుణ్ని ఉపాసకులు ఆరాధిస్తారు. వాటికి ద్వాదశ ఆదిత్యులు అని పేరు. సూర్యకిరణాలు అనంతమైనవే అయినా, ప్రధానంగా సుషమ్మం హరికేశం విశ్వకర్మ విశ్వవ్యచ సంపద్వంశ ఆర్వాగ్వం స్వరాడ్వసు... అనే ఏడు కిరణాలను వేదవిదులు సూర్యరథంలోని ఏడు గుర్రాలకు, ఇంద్రధనుస్సులోని ఏడు వర్ణాలకు అన్వయించి చెబుతారు. ప్రత్యక్ష నారాయణుడిగా లోకచక్షువుగా కర్మసాక్షిగా ప్రజలు సంభావిస్తారు. మహాభారతంలో కుంతీదేవి సూర్యభగవానుణ్ని త్రిపురుషమూర్తిగా, త్రివేదమయుడిగా సంబోధించడం ఒక విశేషం. ఉదయం బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నం మహేశ్వర చైతన్యంగా, సాయంకాలం విష్ణుస్వరూపుడిగా సూర్యుణ్ని ఆరాధించడం సంప్రదాయం. కనుక ఆయన త్రిపురుషమూర్తి. అలాగే ఆ మూడు సంధ్యల్లో సూర్యభగవానుణ్ని వరసగా రుగ్వేద యజుర్వేద సామవేద స్వరూపుడిగా పురాణాలు అభివర్ణించాయి. ఆ రకంగా ఆయన త్రివేదమయుడు. ‘ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కక్కడై తోచు’ అని పోతన ఊరికే అన్నాడా మరి!
ఉషాకిరణాలు తిమిర సంహరణాలు. తిమిరం అంటే చీకటి మాత్రమే కాదు, అజ్ఞానం కూడా! వెలుగులకు, వికాసానికి, జ్ఞానానికి సూర్యుడు ప్రతీక. అనుదినం చూస్తున్నదే అయినా ఏ రోజుకారోజు నిత్యనూతనంగా దర్శనం ఇవ్వడం ప్రభాత సూర్యుడిలో ప్రత్యేక ఆకర్షణ. అది కవులకు నిరంతరం ప్రేరణ. సూర్యనమస్కారాల వెనక ఆరోగ్యసూత్రాల గురించి ఆయుర్వేదం వెల్లడించింది. భాస్కరుడు ఆరోగ్యప్రదాత అని ఆధునిక వైద్యశాస్త్రాలు ప్రకటించాయి. సూర్యుడు సకల జనావళికి స్నేహితుడై, హితుడై- ‘మిత్ర’ శబ్దానికి సార్థక్యం చేకూర్చాడు. ఆ మైత్రిని నిలుపుకొన్నవారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది.
Commentaires