త్రిజన్ముడు సువర్ణ స్ఠీవి.
- B Ashok Kumar
- Jun 5, 2018
- 2 min read
దేవర్షి నారదునికి పర్వతుడు అనే మేనల్లుడున్నాడు. అతడూ దేవర్షే. వారిద్దరూ చాలా కాలం కలిసి త్రిలోక సంచారం చేసేవారు. ఒకసారి వారు తమ మధ్య దాపరికాలు ఉండరాదని పెద్ద కోరికలను ఒకరికి ఒకరు చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరైనా ఏవైనా దాస్తే అది నియమ భంగం అవుతుంది కనుక వారిని అవతలివారు శపించవచ్చని కూడా అనుకున్నారు. ఇలా ఉండగా వారిద్దరూ ఒక సారి భూలోక సంచారానికి వచ్చి సృంజయుడనే మహారాజు ఆస్థానానికి వెళ్లారు. ఆ రాజు వారిని సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యాదులిచ్చి తమ అంత:పురంలో కొంత కాలం ఉండమన్నాడు. వారు అంగీకరించారు.
ఆ రాజుకు అద్భుతమైన సౌందర్యంతో అలరారే సుకుమారి అనే పేరుగల ఒక కుమార్తె ఉంది. నారదుడు ఆమె అందచందాలకు ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆమెలేని జీవితం వ్యర్థమని భావించాడు. అయితే దేవర్షి అయిన తను ఒక మానవకాంత మోహంలో పడ్డాడని తెలిస్తే రాజు, ప్రజలు నిందిస్తారని భయపడ్డాడు. అయితే లోపలున్న కోరిక అతనిని దహించి వేయసాగింది. దానితో అతను కృశించిపోవడం మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని గమనించి పర్వతుడు దివ్యదృష్టితో నారదుని అంతరంగాన్ని తెలుసుకుని 'మామా నీవు నాకు యధార్థం తెలుపలేదు. కనుక ఆ సౌందర్య రాశితో నీకు వివాహం జరిగినా నీవు కోతి ముఖం కలవాడవవుతావ'ని శపించాడు. దానితో కోపించిన నారదుడు అతనికి 'అరణ్యప్రాంతాలలో సంచరిస్తావ'ని ప్రతి శాపం ఇచ్చాడు.
కొంత కాలానికి నారదుడు తన కోరిక చెప్పడం, దేవర్షి, నిత్య యవ్వనుడు కావడంతో సృంజయుడు అతనికి రాకుమారితో వివాహం చేయడం జరి గింది. (నారదునికి వివాహం జరగడం అనేది ఒక కల్పంలోని కథ అని విజ్ఞుల వివరణ). వివాహం కాగానే నారదుడు వానరముఖుడయ్యాడు. అయినా ఆ రాకుమార్తె పతియే ప్రత్యక్ష దైవమని ఆయనకు సంతృప్తిగా సపర్యలు చేయసాగింది. తాను ఇచ్చిన శాపం వల్ల ఆ సాధ్వీమణి అయిన రాకుమారి బాధపడరాదని పర్వతుడు నారదునికి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకున్నాడు. నారదుడు కూడా పశ్చాత్తాప పడి తాను పర్వతునికి ఇచ్చిన శాపం ఉపసంహరించుకున్నాడు.
కొంత కాలానికి సుకుమారికి ఒక కుమారుడు కలిగాడు. తన కుమారుని శరీరం నుంచి విసర్జించే మాలిన్యాలు, స్వేదం బంగారమవుతుంటాయని అతనికి ఆ శక్తి ఉన్నదని నారదుడు తెలిపాడు. దానితో రాజు అతనికి సువర్ణ స్ఠీవి (బంగారాన్ని వెలువరించువాడు) అని పేరు పెట్టాడు. (శరీరంలోనికి విద్యుత్త్తు ప్రవహించినా మరణించని వ్యక్తి ఒకరు ప్రస్తుత కాలంలో ఉన్నారు. సువర్ణ స్ఠీవి శరీరంలోని అద్భుతం కూడా అటు వంటిదే). అయితే నారదుడు తన కుమారుని అద్భుత శక్తి వల్ల అతనిని అంత:పురంలోనే జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉండాలని హెచ్చరించి. ఒక వేళ ఎవరైనా అతనిని చంపివేస్తే తనను తలచుకుంటే వచ్చి బతికిస్తానని కూడా భరోసా ఇచ్చాడు. అనంతరం పర్వతునితో కలిసి త్రిలోక సంచారానికి బయలుదేరాడు. సువర్ణ స్ఠీవికి ఉన్న గొప్ప శక్తి రాజ్యంలో అందరికీ తెలిసింది. కొందరు గజదొంగలు పకడ్బందీ వ్యూహం పన్ని అతనిని అపహరించుకుపోయారు. అతని శరీరం నుంచి వచ్చే మాలిన్యాలు బంగారమవుతున్నాయంటే అతని ఉదరంలో అమిత బంగారంతో నిండిన భాండమేదైనా ఉండి ఉండవచ్చని దానిని తీసుకోవచ్చని అతనిని చంపివేశారు. అయితే అతని కడుపులో అటువంటి దేమీ లేకపోవడంతో అతని మృతదేహాన్ని అక్కడే వదలి వెళ్ళారు. సువర్ణ స్ఠీవి నిహతుడైన విషయం అతని తల్లికి, తాత అయిన రాజుకు తెలిసింది. వారు చాలా దు:ఖించి నారదుని ప్రార్థించారు. నారదుడు వచ్చి సువర్ణ స్ఠీవిని బతికించాడు. అయితే సువర్ణస్ఠీవికి ఇంద్రుని కారణంగా మరణం సంభవించే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు.
ఆయన చెప్పినట్లే సువర్ణ స్ఠీవి చరిత్ర విన్న ఇంద్రుడు అతనికున్న శక్తి ప్రకృతి విరుద్ధమైనదని, దాని వలన మానవులలో అనవసర దురాశ, హత్యలు జరుగుతాయని, అంతే కాక సువర్ణ స్ఠీవి ఐశ్వర్యంలో తనను మించిన వాడవుతాడేమోనని భయపడ్డాడు. తన వజ్రాయుధాన్ని పెద్ద పులిగా మార్చి సువర్ణ స్ఠీవిని చంపమని ఆజ్ఞాపించాడు. వజ్రాయుధం సమయం కోసం వేచి చూసింది. ఒకనాడు సృంజయ మహారాజు నదీ విహారానికి బయలుదేరాడు. ఆ సమయంలో వ్యాఘ్ర రూపంలో ఉన్న వజ్రాయుధం సువర్ణ స్ఠీవిని చంపివేసింది. దానితో బాలుని తల్లి, రాజు నారదుని ప్రార్థించారు. నారదుడు ప్రత్యక్షమై అతనిని బతికించాడు. అనంతరం నారదుడు తన కుమారుని వల్ల్ల సమాజంలో ఎటువంటి కల్లోలం జరగదని, అతడు ఐశ్వర్యంలో ఇంద్రుని మించిపోయే అవకాశం లేదని తెలిపాడు. దానితో ఇంద్రుడు అతనిని దీవించాడు. సువర్ణ స్ఠీవి పెరిగి పెద్దవాడై రాజ్యపాలన చేశాడు. ఆ విధంగా సువర్ణ స్ఠీవి త్రిజన్ముడయ్యాడు.
మంగళం మహత్
留言