చాణక్య నీతి :- 1
- B Ashok Kumar
- May 30, 2018
- 1 min read
Updated: Jun 3, 2018
మూర్ఖశిష్యోవదేశేన దుష్టాస్త్రీ భరణేన చ !
దుఃఖితే సంప్రయోగేణ పండితో అప్యవసీదతి !!

మూర్ఖుడైన శిష్యుని చదివించితే, అతడికి ఉపదేశాలిస్తే , దుష్టురాలైన స్త్రీని భరించి పోషిస్తే , అలాగే దుఃఖితులైన వారి సాంగత్యము చేసుకుంటే విధ్వంసుడయినా వాడు కూడా దుఃఖితుడౌతాడు. ఎంత తెలివైనవాడైనా మూర్ఖుడైన శిష్యుని చదివించితే, దుష్టురాలైన స్త్రీతో కాపురం చేస్తే కష్టాలు రోగాలతో ఉన్నవారి మధ్య ఉంటే విద్వాంసుడు కూడా దుఃఖభాజనుడు అవుతాడు. సాధారణమైనవాడైతే వాని మాట చెప్పనక్కర్లేదు. అందుచేత శిష్యుడు మూర్ఖుడైతే వాడికి చదువు చెప్పనక్కర్లేదు అని నీతి చెప్పుచున్నది . దుష్ట స్త్రీతో సంబంధం పెట్టుకోకుండా అలాంటివారికి దూరంగా ఉండాలి . దుఃఖంతో ఉన్నవాళ్లమధ్య ఉండకూడదు .
ఈ మాటలు ఎంతో సామాన్యంగా ఉన్నాయని తోస్తుంది గానీ , లోతుగా ఆలోచిస్తే ఎవడైతే అర్హుడో వాడికే చదువు అబ్బుతుంది మరియు వాడికే చదువు చెప్పాలి అని తేటతెల్లమౌతుంది. చెప్పే పాఠాలను గ్రహించి బోధపరచుకున్నవాడికి చదువంటే ఇష్టం ఉన్నవాడికే చదువు చెప్పాలి .
ఈ కథ మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి వర్షంలో తడుస్తున్న కోతికి ఒక పిచ్చిక , గూడు ఎలా కట్టుకోవాలో నేర్పింది . అయితే కోతి కోతే , దానికి తెలుసుకోడానికి యోగ్యత ఉండాలి కదా . పిచ్చిక చెప్పింది నేర్చుకోలేదు సరికదా ఆ పిచ్చిక గూడిని కూడా పాడుచేసి చిందరవందర చేసింది ఆ కోతి . ఏ విషయం మీదైనా ఏమి తెలియని వాడికి ఏదయినా తేలికగా చెపొచ్చు, మిడిమిడి జ్ఞానం ఉన్నవాడికి చెప్పడం బ్రహ్మతరం కూడా కాదు . ఈ సందర్భంలోనే చాణక్యుడు దుష్ట స్త్రీతో స్నేహం చెయ్యడం , ఆమెను పోషించడం వ్యక్తికి దుఃఖకరణమవుతాయి చెప్పేరు. తన పతి యొక్క నమ్మకాన్ని చూరగొనలేకపోతే ఆ స్త్రీ ఇంకొకరికి ఎలా నమ్మకపాత్రురాలు కాగలదు ? అవలేదు . ఈ విధంగానే ఆత్మబలం కోల్పోయి దుఃఖభాజనుడయినా వాడు నిరాశ నిసృహలకు లోనైనవాణ్ణి ఎవరూ ఉద్ధరించలేరు . అందుచేత తెలివైన వాడు ఈ ముగ్గురినీ అంటే మూర్ఖుడు , దుష్టస్త్రీ మరియు కష్ఠాలతో దుఃఖభాజనుడిని తప్పించుకొని నడువవలెను .
Comentários