ప్రతి జీవికి ఒక లక్ష్యం
- B Ashok Kumar
- Jun 5, 2018
- 2 min read
మానవులు కర్మ జన్యులు. అవతార పురుషులు సంకల్ప జన్యులు. మానవులు గత జన్మలో చేసిన పాప పుణ్యాల ఫలితంగా ప్రారబ్ధ రూపంలో ఈ జన్మని తీసుకుని సుఖదు:ఖాలను అనుభవిస్తారు. ప్రతి జన్మకీ, ప్రతి జీవికీ నిర్దిష్ట కార్యక్రమాలు, లక్ష్యాలు, గమ్యాలు ఉంటాయి. ధర్మబద్ధంగా జాగరూకతతో తమ విధులు నిర్వహించుకుని, లక్ష్యాన్ని సాధించుకున్న వారికి, గమ్యాన్ని చేరుకున్న వారికి ఈ లోకంతో పనిలేదు. ఈ లోకానికి వారితో పనిలేదు. చరమదశలో సర్వాంగాలూ శిథిలమై చనిపోతారు. అదే కాలధర్మం. అది ప్రకృతి సహజం. నారాయణుని అంశతో ఆవిర్భవించిన నరనారాయణులనే ఋషులు ద్వాపర యుగంలో ఈ భూమి మీద కృష్ణార్జునులుగా జన్మించారు. తమ తమ అవతార కార్యక్రమాలు పూర్తి కాగానే భూమిని వదలిపెట్ట్టి తమ తమ లోకాలకు వెళ్లిపోయారు. అవతార పురుషుల విషయంలోనే కాదు దేవదత్త్తమైన వస్తువుల విషయంలోనూ ఇది జరుగుతుంది. ఈ విషయాన్ని సాక్షాత్తు కృష్ణుడే అర్జునునికి చెప్పాడు.
కురుక్షేత్ర యుద్ధానంతరం రణరంగ ప్రాంతమంతా శవాల గుట్టలతో, ఏనుగుల, గుర్రాల కళేబరాలతో విరిగిన రథాలతో బీభత్సంగా, భయానకంగా ఉంది. విజేతలైన వీరులు చివరి రోజు రాత్రి శత్రు శిబిరంలో విశ్రమించాలన్నది ఆనాటి ఆచారం. పాండవులను వెంటబెట్టుకుని కౌరవుల శిబిరం వద్దకు వెళ్ళాడు కృష్ణుడు. పార్థసారథి కనుక కృష్ణుడు అర్జునుని రథానికి సారథ్యం వహించాడు. కృష్ణుడు తమ పక్ష విజయానికి సంకేతంగా శంఖారావాలు చేయించాడు. ఢంకా ధ్వానాలు మోగింపజేశాడు.
తరువాత కృష్ణుడు అర్జునుని ఉద్దేశించి, 'అర్జునా! నీవు గాండీవాన్ని, ఇతర ఆయుధాలను తీసుకుని రథం నుంచి కిందికి దిగి దూరం వెళ్లు' అన్నాడు. ఇది మామూలు పద్ధతికి విరుద్ధం. సారథి దిగినాకే యోధుడు దిగడం సంప్రదాయం. అయితే కృష్ణుడు చెప్పాడని అర్జునుడు ఇక సందేహించకుండా గాండీవం, ఇతర ఆయుధాలను తీసుకుని రథం నుంచి దిగాడు. కృష్ణుడు కూడా ఇన్నాళ్లు సారథిగా తన చేతిలో ఉన్న కొరడాను, గుర్రాల కళ్ళాలకు వేసే పగ్గాలను అక్కడే వదిలేసి రథం మీద నుంచి కిందికి ఎగిరి దూకాడు. కృష్ణుడు దూకిన మరుక్షణమే హనుమంతుడు నిలిచి ఉన్న ధ్వజ కేతనం అంతరిక్షంలోకి ఎగిరిపోయి అదృశ్యమైంది. పాండవులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. వెంటనే రథంలో అగ్ని జ్వాలలు చెలరేగి రథం బూడిదరాశి అయింది. భయ సంభ్రమాలతో పాండవులు స్థాణువులైపోయారు. వారు ఊహించని ఘటన ఇది. ఆ దృశ్యాన్ని చూసి అర్జునుడు తట్ట్టుకోలేకపోయాడు. ఖాండవ దహన సమయంలో అగ్నిదేవుడు అర్జునుడికిచ్చిన కానుక ఆ రథం.
అప్పటి నుంచి అర్జునునికి, ఆ రథానికి విడదీయరాని సంబంధం ఏర్పడింది. ఆ రథ చక్ర ధ్వనులు వింటూనే శత్రువుల గుండెలు బెంబేలెత్తేవి. అర్జునుడు వచ్చే కన్నీటిని అపుకుంటూ, కృష్ణా! ఎందుకిలా జరిగింది? అగ్ని దేవుడు ఎంతో ప్రేమతో ఇచ్చిన కానుక ఇది. దీని సహాయంతోనే ఖాండవ దహనం చేశాను. శత్రుభీకరమైన ఈ రథం ఎందుకిలా దగ్ధమైంది. అంటూ ఖిన్నుడయ్యాడు. అప్పుడు కృష్ణుడు దానికొక కారణం చెప్పాడు. అర్జునా! నిర్దేశిత కార్యం కోసం వచ్చిన అవతార పురుషులు, వస్తువులు అది పూర్తవగానే కనుమరుగవుతాయి. ఇది అసామాన్యులైన భీష్మద్రోణాదులు, ఇతర వీరుల భయంకరాస్త్రాల ప్రభావానికి గురైంది. బ్రహ్మాస్త్ర సైతం దానిని ఏమీ చేయలేకపోయింది. కారణం నేనందులో కూర్చుని ఉండడమే. నేను సారథిగా ఉండి అన్ని అస్త్రాల శక్తిని అణచి ఉంచాను. నీవు సురక్షితంగా బయటపడ్డ్డావు. కథ ముగిసిపోయింది. చివరగా నేను దిగి పోగానే ఆ అస్త్రాల శక్తిని వదలడంతో అది కాలి దగ్ధమైంది. ఇక దానితో నీకు పని లేదు. ఆ రథం తన కర్తవ్యాన్ని నిర్వహించి అదృశ్యమైంది. పుట్టిన ప్రతి జీవికి నిశ్చితమైన లక్ష్యం, కార్యకలాపాలు ఉంటాయి. తన లక్ష్యం సాధించుకున్న తర్వాత ఆ జీవితో ప్రపంచానికి గాని ప్రపంచానికి ఆ జీవితో గానీ అవసరం ఉండదు. అప్పుడు భూమిని విడిచి వెళ్లిపోతాడు.
లేకపోతే భూమికి భారమైపోతాడు. ప్రతి అవతార పురుషునికి నిర్దిష్టమైన కార్యక్రమాలుంటాయి. ప్రధానంగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ , ధర్మ సంస్థాపన చెప్పుకోవాలి. అందుకే నేను యదు వంశంలో జన్మించాను. నా కర్తవ్యం నేను నెరవేర్చాను. ఇక యాదవ వంశ వినాశనం జరగాలి. అంతటితో నా అవతార పరిసమాప్తి అవుతుందని చెప్పాడు. అవతారమూర్తి కృష్ణుని పలుకులను అందరూ వింటూ ఉండిపోయారు.
Comments