top of page
  • Black Facebook Icon
  • Black YouTube Icon
  • Black Instagram Icon
  • Black Pinterest Icon

పరహితమే పర్వదినం

  • Writer: B Ashok Kumar
    B Ashok Kumar
  • Jun 11, 2018
  • 2 min read

Aadhyatmikam

ప్రతి వ్యక్తీ ఉన్నత మనస్విగా ఎదిగినప్పుడు సకల జగత్తూ శుభప్రదమై శోభిల్లగలదన్నది ఇస్లామ్‌ పవిత్ర ఆశయం. ఇందుకు ఔదార్యంతో కూడిన ఉదాత్తగుణం అవసరం. సమాజంలో సజీవంగా కనిపిస్తున్న స్వార్థం, లోభం ఇంకిపోవాలి. అనాథల్ని ప్రేమించగలగాలి. పేదరికాన్ని రూపుమాపాలి.

రమజాన్‌ మాసంలోని శిక్షణలో భాగంగా మహాప్రవక్త దానశీలతను ఈ ఆశయ పరిపూర్తికోసం ప్రబోధించారు. హృదయాల్లో త్యాగం, సానుభూతి, సహనం వర్ధిల్లగలవన్నది ఉన్నత భావం. పొరుగువాడు పూటకు పట్టెడన్నం లేక ఆకలితో అలమటిస్తుంటే నీవు సుఖంగా జీవితం గడపడం మానవత్వం కాదు. కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడవాలి. నీ సంపాదనలో కొంత భాగం వారికిచ్చి ఆదుకోవాలి. వారి బతుకుల్లో వెలుగులు నింపాలి. అప్పుడే జీవనయానానికి అర్థం పరమార్థం అని ఇస్లామ్‌ ప్రబోధం. దానం చేసే సమయంలో ఆలోచించదగ్గ అంశం కూడా ఉంది. నిజాయతీ, నిష్కాపట్యంతో దానం చేయనట్లయితే అది కపటదానం అవుతుంది. మానవాళిని హింసించి లేదా వంచించి అక్రమంగా చేసిన సంపాదన నుంచి దానం చేయడం ఇలాంటిదే. ఇస్లామ్‌ దీన్ని ఎంతమాత్రం అంగీకరించదు, సహించదు.

వీలైనంతవరకు దానం గుప్తంగా ఉండాలి. అది దేవుడి కానుకగా పేదలకు అందజేయాలి. పేదలసేవను ప్రతి ఒక్కరూ ఉన్నతమైందిగా భావించాలి. ప్రజలు తమ జీవితాల్లో వితరణబుద్ధి కలిగి ఉండటానికి ఉల్లేఖించదగ్గ ఒక ప్రక్రియను ఇస్లామ్‌ రూపొందించింది.

దీన్ని అనుసరించి మొదట ‘ఫిత్రా’ పేరిట నిర్ణీత దానం అనివార్యంగా ప్రతి ముస్లిమ్‌ పేదలకు ఆనందోత్సాహాలతో చెల్లించాలి. ఈ పని పండుగకన్నా వారం రోజులు ముందే చేయాలి. ఉపవాసం పాటిస్తున్న వ్యక్తి పొరపాటున ఏదైనా నియమం ఉల్లంఘించినా, లేదా అల్పదోషం జరిగినా ఫిత్రా దానం ఆ లోపాన్ని పూరించగలదు. అంతేకాదు, ఈ దానం స్వీకరించడం వల్ల లేమిని అనుభవించేవారి పండుగ అవసరాలు తీరతాయి. ఫిత్రాదానం చెల్లించనంతవరకు రమజాన్‌ ఉపవాసాలు ఫలప్రదం కావు.

రెండో అంశం- సంవత్సరమంతా ఒక వ్యక్తి వద్ద నిలువ ఉన్న ధనంలో నుంచి నిర్ణీత భాగాన్ని విశ్వప్రభువు పేర పేదలకు, సత్కార్యాలకు అందజేస్తే అది పరిశుద్ధ దానం అనిపిస్తుంది. దాన్నే ‘జకాత్‌’ అంటారు. ఈ ‘జకాత్‌’ సంపన్నులే చేస్తారు. ముస్లిములు జకాత్‌ చెల్లింపులకు శుభప్రదమని రమజాన్‌ మాసాన్నే ఎంచుకొంటారు. ఉపవాసం శారీరకపరమైన ఆరాధన అయితే, జకాత్‌ ఆర్థికపరమైన ఆరాధన. దీనివల్ల హృదయ కాఠిన్యం కరిగిపోతుంది. స్వార్థపూరిత మనస్తత్వం వ్యక్తికి సంఘానికి దేశానికి ప్రమాదకరం. స్వార్థపరుడు దాతృత్వం ప్రదర్శించినా తనకోసమే. అతడు పేదలకు సహాయంచేస్తే అనంతరం వారిని దోచుకోవడమే అతని లక్ష్యం. ఈ మనస్తత్వం ప్రబలితే కొందరి వద్దే ధనం కేంద్రీకృతమవుతుంది. అనేకులు నిరాధారులవుతారు. నిరుపేదల బతుకులు దైన్యంగా మారిపోతాయి. అలాకాకుండా జకాత్‌ లోభత్వాన్ని నివారిస్తుంది. సంకుచిత ధోరణిని తొలగిస్తుంది. దైవగుణాన్ని అలవరచుకొనేలా చేసి ఆనందాల పంట పండిస్తుంది.

కృత్రిమస్తుతుల కోసం, కొనితెచ్చుకొనే గౌరవం కోసం ఆరాటపడితే అది దైవదృష్టిలో క్షమించరాని నేరం. పరులను బాధించడం వల్ల ఉపవాస వ్రతాలు, దానాలు వ్యర్థమవుతాయి. ప్రతి ముస్లిమ్‌ అమలిన నిష్ఠతో జీవితం గడపడమే ధార్మికవిధి. అంతా గ్రహించిన ముస్లిమ్‌ దుష్కృత్యాలకు దూరమవుతాడు. ఉత్తమ ఆలోచనలకు బీటలు పడకుండా చూసుకొంటాడు. సత్యం, ధర్మం, దయ, ప్రేమ, సదాచారం, సుహృద్భావాలకు ప్రతీకగా ప్రవర్తిస్తాడు. మనలోని అహంభావాన్ని, అజ్ఞానాన్ని మనం గమనించనంత కాలం దేవుడు మన వైపు చూడడని సమాజానికి హితవాక్యాలు వివరిస్తాడు.

హృదయంలేని దానధర్మాలు వద్దు.ఎనలేని ఐశ్వర్యం మానవత్వాన్ని మరపింపజేస్తుంది. నీపై నీవు నిఘా ఉంచుకో. ఏ ముస్లిమూ విస్మరించరాని మాటలివి!

Comments


PAGE VIEWS

JOIN MY MAILING LIST

Copyright © 2018 AADHYATMIKAM. All rights reserved.

bottom of page