top of page
  • Black Facebook Icon
  • Black YouTube Icon
  • Black Instagram Icon
  • Black Pinterest Icon

రామాయణం జీవన పారాయణం..

  • Writer: B Ashok Kumar
    B Ashok Kumar
  • Jun 5, 2018
  • 2 min read



Aadhyathmikam

మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. ఈ నాటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పారాయణ చేసే గ్రంథం రామాయణం. ఎందుకంటే, రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణంలో ముందుగా చెప్పవలసింది సీత గురించే. భర్తపై ఒక స్త్రీకి ఎంతటి ప్రేమానురాగాలు ఉండాలో, భార్యగా భర్త పట్ల ఏ ధర్మాన్ని అనుసరించాలో సీత నుంచి తెలుసుకోవచ్చు. రేపే తన భర్తకు అయోధ్యానగరానికి రాజుగా పట్టాభిషేకం. తానేమో మహారాణి.


తెల్లారేసరికి భర్త వచ్చి, 'నేను రాజును కావడం లేదు, పైగా నా తండ్రి నన్ను అడవులకి వెళ్లమన్నాడు, అదీ కూడా ఒకటి కాదు, రెండు పద్నాలుగేళ్లపాటు వనవాసం చే యాలి' అని చెప్పాడు. అయినా సరే, సీతమ్మ పెదవి విప్పి ఒక్క పొల్లుమాట మాట్లాడలేదు. ఆధునిక కాలంలో లాగా 'నువ్వు ఉట్టి చేతగాని భర్తవి' అంటూ ఆడిపోసుకోలేదు. ఒక దేశానికి రాకుమార్తె అయి వుండి కూడా పుట్టింటికి వెళ్ళిపోతానని అనలేదు. వద్దు వద్దు అంటున్నా కానీ, తన భర్తనే అనుసరించింది. ఆయనతో కలసి అరణ్యవాసం చేసింది, అనేక కష్టాలు పడింది. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా, నీడగా నిలవాలని చెప్పకనే చెప్పింది. అదే సీత ఇచ్చే సందేశం.


లక్ష్మణుడి వంటి సోదరుడిని మనం చరిత్రలో ఎక్కడా చూసి ఉండం. చరిత్ర ప్రారంభం నుంచి పరిశీలిస్తే రాజ్యం కోసం సొంత సోదరుల్నే కడతేర్చిన వారిని చూసి ఉంటాము. కన్నతండ్రినే ఆస్తికోసం కిరాతకంగా హతమార్చినవారిని ఇప్పుడు మనం చూస్తున్నాం. అటువంటిది అన్నగారి కోసం రాజభోగాల్ని వదిలి, కూడా వెళ్ళిన లక్ష్మణుడి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మిగతా ఇద్దరు సోదరులు భరతుడు, శతృఘ్నుడు కూడా అన్నగారు లేని రాజ్యం తమకెందుకని సింహాసనంపై పాదుకలు వుంచి పరిపాలన చేశారు. ఇటువంటి అన్నదమ్ముల అనుబంధం ఎక్కడయినా వుంటుందా?


ఇక స్వామి భకిక్తి సిసలైన నిదర్శనం హనుమంతుడు. కాస్త ఎక్కువ జీతం ఇస్తే చాలు వెంటనే వుద్యోగం మారిపోయే ఈ రోజుల్లో హనుమంతుని వంటి నిస్వార్థ పరుడు, స్వామిభక్తి పరాయణుడి గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది వుంటారు? ఒకసారి తన ప్రభువుగా అంగీకరించిన తరువాత, తనకు రాముడు అప్పజెప్పిన పనిని పూర్తి చెయ్యలేకపోయానే మరలా నా స్వామికి నా ముఖం ఎలా చూపించను? అని ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడతాడు హనుమ.


అంతేగాని యజమాని చూడడం లేదు కాబట్టి ఈ పని పూర్తి చేసేసాను అని అబద్ధం చెప్పలేదు. రామ రావణ యుద్ధం జరిగినప్పుడు కూడా యుద్ధమంతా తానే అయి నడిపించాడు హనుమ. అంతటి శక్తిమంతుడయి ఉండి కూడా ఎప్పుడూ తనవల్లే ఇదంతా జరుగుతుందని గొప్పలు చెప్పుకోలేదు. తన హృదయంలో కొలువయి వున్న రామనామం వల్లనే తనకింత బలం వచ్చిందని వినమ్రంగా చెపుతాడు హనుమ. అటువంటి సేవకుడిని మనమెప్పటికయినా ఎక్కడైనా చూడగలమా?


ఒక పరాయి స్త్రీని ఆశపడితే ఎంతటి విషమ పరిస్థితులని ఎదుర్కోవలసి వస్తుందో అన్నదానికి ఉదాహరణ రావణుడు. అవడానికి అసురుడైనా ఎంతో విద్వాంసుడు, మహా శివభక్తుడు. అయినా ఒక స్త్రీని బలాత్కరించబోయి యావత్‌ లంకానగరానికే ముప్పుని కొని తెచ్చుకున్నాడు. చివరికి తన ప్రాణాలనే కోల్పోయాడు. కామాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే మనిషి ఎంత పతనమవుతాడో చెప్పడానికి రావణుడే ఒక ఉదాహరణ.సీతాదేవి నగలమూట దొరికినప్పుడు రాముడు నీళ్ళు నిండిన కళ్ళతో 'లక్ష్మణా, ఇవి మీ వదినగారి నగలేనా చూడవయ్యా' అని అడిగితే, దానికి లక్ష్మణుడు ''నేను వీటిలో వదినగారి కాలి మట్టెల్ని మాత్రమే గుర్తుపట్టగలను'' అని చెప్పాడు. అంటే ఎప్పుడూ తన తల్లి లాంటి వదినగారి పాదాల వంక తప్ప పైకి కూడా చూడలేదన్న మాట. అదీ ఒక వదినకీ, మరిదికీ వుండవలసిన గౌరవం.


ఇక రాముడి గురించి చెప్పాల్సి వస్తే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. తండ్రికి మంచి తనయుడిగా, ఇల్లాలికి మంచి భర్తగా, సోదరులకి మంచి అన్నయ్యగా, సేవకుడికి మంచి యజమానిగా, స్నేహితుడికి మంచి స్నేహితుడిగా, శతృవుకి తగ్గ ప్రత్యర్థిగా. ఇలా రాముడి ప్రతి మాట, ప్రతి కదలిక, ప్రతి సంఘటన మనకి ఒక సందేశాన్నిస్తూనే వుంటాయి. స్ఫూర్తిని నింపుతూనే వుంటాయి. వ్యక్తిగా ఆయన అనుసరించిన మార్గం మానవ సమాజంలో వున్న ప్రతీ వ్యక్తికీ దేశ, కాల, మత, కుల ప్రసక్తి లేకుండా అనుసరణీయం.ఎన్ని కష్టాలు ఎదురయినా తాను నమ్మినదాన్ని ఆచరణలో పెట్టినవాడే చరిత్రలో ధీరోదాత్తుడిగా మిగిలిపోతాడు. రాముడి జీవితంలో ఆయన ఆచరించి చూపిన సద్గుణాల్లో కొన్నయినా ఆచరించగలిగితే ఈనాడు మానవాళి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల నుంచి బయట పడగలుగుతుంది. అందుకే రామాయణం ఒక మహత్తర కావ్యం అయింది.

Comments


PAGE VIEWS

JOIN MY MAILING LIST

Copyright © 2018 AADHYATMIKAM. All rights reserved.

bottom of page