రాళ్లెందుకు తేలాయి.?
- B Ashok Kumar
- Jun 5, 2018
- 2 min read
శ్రీరాముడు ధర్మ పురుషుడు. రామాయణం ధర్మకావ్యం. ఆది కావ్యం. ధర్మాన్ని ఎలా ఆచరించాలి, అలవరచుకోవాలి అనే విషయాన్ని విపులంగా విశదీకరిం చే ఉత్తమ గ్రంథం రామాయణం. రామాయణంలో ఎన్నో ఘట్ట్టాలు, సంఘటనలు. ప్రతి ఘటన వెనుక మహత్త్తరమైన సందేశాన్ని అందించే ఎన్నో సన్నివేశాలు. వివిధ కోణాల్లో, ఎన్నెన్నో మార్గాల్లో ధర్మాన్ని, ఆదర్శాన్ని అందించిన అవతారమూర్తి శ్రీరామచంద్రమూర్తి. శ్రీరాముని గమనాన్ని అందంగా, మహోన్నతంగా ఆవిష్కరింపజేసిన మహా ఇతిహాసం రామాయణం. ఎన్నో పాత్రలు, ప్రతి పాత్ర వెనుక ఒక నేపథ్యం. ఎన్నెన్నో సన్నివేశాలు, ప్రతి సన్నివేశం మధుర రసభరితం. రసప్లావితం..సన్నివేశ ఆవిష్కరణ నేపథ్యం, అదేవిధంగా సన్నివేశ నేపథ్యం మహాద్భుతం. ఒక పకడ్బందీ సూత్రీకరణ, శాస్త్త్ర సమ్మ తమైన సహేతుక కారణం. నియమం, నిబంధన సూక్ష్మీకరణ ఆ రచన లో ఉంటుంది. రామాయణంలోని ఒక ఘట్ట్టాన్ని ఇక్కడ గుర్తు చేసుకుందాం.
సీతమ్మ వారి జాడ తెలుసుకున్న హనుమంతుడు ఆ విషయాన్ని రామునికి వివరిస్తాడు. రాముడు సుగ్రీవునితో, వానర సైన్యంతో సముద్ర తీరానికి చేరుకుంటాడు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. దానిని దాటడం ఎలాగో అర్థం కాక రాముడు సముద్రుణ్ని ప్రార్థిస్తాడు. సముద్రుడు సేతువు నిర్మించమని సలహా ఇస్తాడు. దాని నిర్మాణానికి పథక రచన జరిగింది. నిర్మాణం పనులు మొదలయ్యాయి. ఇక్కడ మనమో విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సేతువు నిర్మాణం నిమిత్తం పెద్ద పెద్ద రాళ్లను, ఇంకా చెప్పా లంటే పెద్ద పెద్ద పర్వ తాలను నీళ్లలో పడవేస్తే సహజంగా బరువైన ఆ బండలు నీళ్ళలో మునిగిపోతాయి. కాని ఆశ్చర్యకరంగా అంత బరువున్న బండలు, పర్వతాలు సైతం విచిత్రంగా నీటి మీద తేలియాడాయి. ఏమిటీ విచిత్రం? ఇదెెలా సాధ్యం? భౌతికంగా ఇలా జరగడం అసాధ్యం. ఇలా ఎలా జరిగింది అనే అనుమానం రావడం సహజం. ఈ అనుమానాలను నివృత్తి చేసే సూత్రం కాని, సూత్రీ కరణగానీ ఏదైనా ఉందా అనేది విచారించాలి. ఈ విధంగా పరిశీలన చేస్తే మనకి సహేతుక కారణం, నేపథ్యం రెండు విధాలుగా రెండు వేర్వేరు కోణాల్లో దొరుకుతుంది.
మొదటి కోణంలో చూద్దాం.. సేతువు నిర్మాణానికి వానరులు ఉపక్రమించినపుడు సముద్రుడిలా అన్నాడు. 'రామా! మీ దళంలో నలుడు, నీలుడు అనే ఇద్దరు సేనాపతులున్నారు. పూర్వం నదీ తీరాన ఉన్న ఆశ్రమంలో ఉండి ఋషులు తపస్సు చేసుకునేవారు. అప్పుడు ఈ నలుడు, నీలుడు చిన్నవారు. వారు ఋషులు తమ పూజలో ఉపయోగించే సాలగ్రామాలను అపహరించి నీళ్ల్లలో విసిరేసేవారు. దానితో అవి మునిగి పోకుండా ఉండేందుకు, వాటిని తిరిగి తెచ్చుకునేందుకు వారు విసిరిన వస్తువులు నీటిపై కదలకుండా, తేలి ఉండు గాక! అని వారు శపించారు. ఆశాపం ఆశీర్వచనమైంది. వాళ్లు నీటిలో వేసే ప్రతి బండ తేలుతుంది. అందువల్ల మిగతా వానరుల చేత బండలు తెప్పించి వారిద్దరి చేత నీటిలో వేయించు' అని సముద్రుడు సలహా ఇచ్చాడు. ఇక రెండో కోణంలో పరిశీలిస్తే కొందరు వానరులు నీటిలో వేసిన బండలు తేలడం కూడా రాముడు చూశాడు. తాను కూడా కొన్ని రాళ్ళు వేశాడు. అవి మునిగిపోయాయి. ఎన్నిసార్లు చేసినా అలానే జరిగింది. దీనికి కారణం వానరులను అడిగాడు. దానికి వారు 'మేము నీటిలో వేసే బండల మీద మీ పేరు రాస్తున్నాం. మీ నామ మహిమ వల్ల అవి తేలుతున్నాయి. మీరు వేసిన రాళ్లపై ఆ పేరు లేదు కదా. అందువల్లనే అవి తేలలేదు' అన్నారు. నా నామం రాసినంతనే రాళ్లు తేలుతున్నపుడు నేను స్వయంగా వేస్తే మునిగిపోవడమేమిటని రామునికి సందేహం మొలకెత్తింది. అప్పుడు హనుమంతుడు సమాధానం చెబుతూ, 'స్వామీ! రాముడు వదిలేసినా, రాముని వదిలేసిన ఏదైనా మునిగిపోక తప్పదు' అన్నాడు. ఇది రెండో కోణంలో మరో విధంగా సాగే వ్యాఖ్యానం. రామ నామం విశిష్టతను ఎంతో ఉన్నతోన్నతంగా ఆవిష్క రింపజేసే మహాద్భుత ఆధ్యాత్యిక సూక్ష్మ అభివ్యక్తీకరణ. అందుకే రామాయణం జగత్ప్రసిద్ధమైంది. కాలాలు మారినా, తరాలు మారినా, యుగ యుగాలుగా ప్రజల గుండెల్లో రామ కథ నిలిచి పోయింది. పుణ్య కావ్యంగా పూజలందు కుంటోంది. ఆచరించబడుతోంది. ఆరాధింప బడుతోంది. ఆరాధించబడుతూనే ఉంటుంది. రామాయణం అమృత మయం, అజరామరం. అది వినటం, చదవటం, గానం చేయటం, ఆస్వాదిం చగలగటం, అనుభవించటం, ఆచరించడం, ఆచరింప గలగటం జన్మ జన్మల సుకృతం.
Comments