వాడిన మొగ్గలు
- B Ashok Kumar
- Jun 11, 2018
- 2 min read

‘మొక్కై వంగనిది మానై వంగుతుందా?’ అని ఒక సామెత ఉంది. ఈ సామెత ఎదిగే పిల్లల విషయంలో వాడుకలో ఉన్నదని అందరికీ తెలుసు. పసితనం మొగ్గలాంటిది. యౌవనం కాయలాంటిది. వార్ధక్యం పండులాంటిది. ఈ మూడు దశలూ వాడిపోకుండా వికసించాలంటే మొగ్గదశ వాడిపోకుండా ఉండాలి. మొగ్గ దశలోనే వాడిపోతే రాలిపోవడం తప్ప మరో దారి లేదు. నేడు సమాజంలో బాల్యం ఇలాంటి దుర్భరావస్థను ఎదుర్కొంటోంది. కాలపరిణామంలో మనిషి దినదిన ప్రవర్ధమానం కావాలేగానీ దినదిన పతనం కాకూడదు. మొగ్గలు పతనమై ముళ్లదారుల్లోకి చేరుతున్నా తోటమాలులు అటువైపు చూడటం లేదు. ఇదంతా పసివాళ్ల పట్ల పెద్దల అలసత్వానికి నిదర్శనమే.
పెద్దలు పూర్వం తల్లిదండ్రులకు ఎన్నో హితబోధలు చేసేవారు. పిల్లలను అయిదేళ్ల వయసుదాకా గారాబంగా లాలిస్తూ పెంచాలని, అయిదు నుంచి పదేళ్లదాకా భయభక్తులను తెలియజెప్పి, అదుపులో ఉంచాలని, పదహారేళ్ల తరవాత పిల్లలను స్నేహితుల్లా చూడాలని ప్రబోధించేవారు. ఈ ప్రబోధాలను ఇప్పుడు వినేవారే కరవయ్యారు.
అలనాటి పిల్లల చదువులకు, ఈనాటి పిల్లల చదువులకు ‘హస్తిమశకాంతర భేదం’ (ఏనుగుకు, దోమకు ఉన్నంత తేడా) ఉంది. పూర్వం చదువులన్నీ గురుకులాల్లో జరిగేవి. గురువు శిక్షణ మాత్రమే కాదు, ప్రవర్తననూ ప్రబోధించేవాడు. శుకనాసుని వంటి గురువులు చంద్రాపీడుని వంటి శిష్యులకు ఏది సన్మార్గమో, ఏది దుర్మార్గమో వింగడించి చెప్పి, సన్మార్గంలో నడిపించేవారు. ‘చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!’ అంటూ ప్రహ్లాదుడి వంటి కొడుకు, తండ్రికి తాను చదువుల రహస్యాలను తెలుసుకొన్నానని చెప్పేవాడు. కానీ నేడు తల్లిదండ్రులు, పిల్లలు చదువుల పట్ల అవగాహనతో ఉన్నారో లేదో తెలియదు. ప్రపంచంలో స్పర్ధకు (పోటీకి) నిలబడే చదువులను చదివించాలనుకునే తల్లిదండ్రులు, అపార ధనాన్ని సంపాదించడానికి ఉపయుక్త విద్యలే చదవాలనే కాంక్షగల పిల్లలు- నైతికతకు, మానవ సంబంధాలకు తిలోదకాలిచ్చి విద్యాభ్యాసంలో పురోగమిస్తున్నామనుకోవడం శోచనీయం.
అధునాతన విద్యల పుణ్యమా అని అనుచిత వ్యసనాలు పసిమొగ్గలను కాల్చివేస్తున్నాయి. చిన్నారులను సన్మార్గంలో ఉంచాలనే స్పృహను కోల్పోతున్న ఎందరో పెద్దలు ప్రాచీనుల సూక్తులను చెవికి ఎక్కించుకోవడం లేదు. అడుగడుగునా అలసత్వం, అణువణువునా ఉదాసీనత- మొగ్గలకు పతన మార్గాలను తెరుస్తున్నాయి. ఉన్మాదభరితమైన వాతావరణానికి అలవాటుపడే విధంగా ప్రోత్సహిస్తున్నాయి. చేతినిండా పుష్కలంగా ధనం, విచ్చలవిడిగా తిరిగే స్వేచ్ఛ తల్లిదండ్రులు ప్రసాదిస్తుంటే మొగ్గలకు విద్యాఫలాల మాధుర్యం ఎలా తెలుస్తుంది?
నీతి లేదు. రీతి లేదు. ఖ్యాతి అవసరం లేదు. ఇదీ నేటి ఎందరో వైఖరి. ఏ మహనీయులు మాతృభూమి రుణం తీర్చుకోవడానికి వీధి దీపాల కింద చదువుకొని ప్రపంచానికే వెలుగుదీపాలు వెలిగించారో, ఆ మహనీయులు పుట్టిన నేలలో చీకటి వ్యామోహ సామ్రాజ్యాల్లో గుడ్లగూబలవలె మొగ్గలు తిరుగుతూ ఉండటం అవమానకరం. సమాజానికి మార్గదర్శకులు తల్లిదండ్రులే. తల్లిదండ్రుల ప్రవర్తన నూటికి నూరుపాళ్లు మొగ్గలవంటి పిల్లలపై ప్రసరిస్తుంది. వాడిన పువ్వులే కాదు, వాడిన మొగ్గలూ మట్టిలో కలిసిపోతాయి. వాటికి రూపం కూడా మిగలదు. కనుక పసితనాన్ని వాడనీయకుండా చక్కగా పెంచి పోషించవలసిన గురుతర బాధ్యత తల్లిదండ్రులదే!
댓글