శ్రుతి-స్మృతి-పురాణం
- B Ashok Kumar
- Jun 11, 2018
- 2 min read

శ్రుతి (వేదం), స్మృతి (ధర్మశాస్త్రం), పురాణం... ఒకదాన్ని మరొకటి అనుసరిస్తాయి. ఈ మూడింటిలోనూ చెప్పిన విషయం ఒకటే. కానీ తెలుసుకునేవారి స్థాయిని బట్టి చెప్పే తీరు మారుతుంది. శ్రుతి చెప్పిన విషయాన్ని బాగా అర్థమయ్యేలా, అది చిరకాలం జ్ఞాపకం ఉండేట్లుగా భూతద్దంలో చూపించినట్లు విస్తారమైన వివరణ ఇస్తుంది స్మృతి.
స్మృతి చెప్పిన విషయాలను మరింత సరళతరం చేసి అందరికీ అర్థమయ్యే రీతిలో చెబుతాయి పురాణాలు. వేదవాఙ్మయం అత్యంత ప్రాచీనమైంది. వాటిని సృష్టించినవారు మానవులు కాదు (అపౌరుషేయాలు). కాబట్టి సంస్కృతి-ప్రవర్తన, నడక-నడత, జీవనవిధానం, విజ్ఞానం-వినాశనం, పురోగమనం-తిరోగమనం... లాంటి ఎన్నో విషయాలపట్ల కచ్చితమైన స్పృహ కలిగేటట్లు చేస్తాయవి. వాటిని చదవడానికి, అర్థం చేసుకోవడానికి విద్య, పరిజ్ఞానం, ఆసక్తి లాంటివి ఎక్కువ మోతాదులో ఉండాలి. చాలామందికి అవి సరిపోయినంత ఉండకపోవచ్చు. అందువల్ల వాటి ప్రయోజనం నెరవేరడానికి అవకాశం తక్కువ కావచ్చు.
ఆ పరిస్థితి నుంచి తప్పించడానికి వేదాల సారాన్నంతా ధర్మశాస్త్రాల రూపంలోకి మార్చి చెప్పారు మహర్షులు. ఆ విషయాలనే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రాసినవి పురాణాలు. పురాణం అంటే పూర్వం (ఇంతకుముందు) జరిగిన విషయం అని ఒక అర్థం.
పురుషార్థాలను సాధించడానికి, ఏది ధర్మం-ఏది అధర్మం... అనే స్పృహ కలిగించడానికి పురాణజ్ఞానం ఎంతైనా అవసరమని ఆర్యోక్తి.
‘పురాపి నవం’ (పాతదైనప్పటికీ కొత్తది) అని పురాణ పదానికి నిర్వచనం. అంటే ఎప్పుడో చెప్పినప్పటికీ ఇప్పటికీ ఉపయోగకరంగా ఉంటుందని భావం. అంటే ఏ కాలానికైనా సరిపోయే విషయాలు కలిగి ఉంటాయి అని అర్థం. అలాంటి పురాణాలు పద్దెనిమిది.
అవి- భాగవత, భవిష్య, మత్స్య, మార్కండేయ, బ్రహ్మ, బ్రహ్మ వైవర్త, బ్రహ్మాండ, విష్ణు, వరాహ, వామన, వాయు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణాలు. వీటితోపాటు అదే సంఖ్యలో ఉప పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ వ్యాసుడు రచించాడని ప్రసిద్ధి.
జీవుడు ఏ శరీరం పొందాడు, ఈ శరీరంతో ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నాడు? సన్మార్గంలో పయనిస్తే ఏం జరుగుతుంది లేకపోతే పరిణామాలు, వాటికి నివారణోపాయాలు ఏమిటి? ఏం చేస్తే ఈ శరీరం వదిలి ఇంకో శరీరంలోకి వెళ్తాడు? మళ్ళీ ఎలాంటి శరీరాన్ని పొందుతాడు? ఏం చేస్తే ఈ శరీర సంస్కారాలు (మంచి, చెడులు) అవతలి శరీరంలోకి వెళ్తాయి? మళ్ళీ ఆ సంస్కారం పోగొట్టుకోవడానికి లేదానిలబెట్టుకోవడానికి ఎలాంటి సాధన చెయ్యాలి? చేసిన పాపపుణ్యాలకు వాళ్ళు ఉత్తర జన్మల్లో ఏ శరీరం పొందుతారు? ఆ జన్మలో తరించిపోతారా? లేక ఇంకా జన్మలు ఎత్తవలసి ఉందా? ఇప్పటికీ ఏదైనా జన్మ వాసనా బలం వారిని వెంటాడుతూ ఉందా? ఉంటే అది ఎలా తొలగిపోతుంది...చివరిగా పరమేశ్వరుడిలో లీనమైపోవడానికి ఎంత కష్టపడవలసి ఉంటుంది? ఇటువంటి విషయాలను పురాణాలు వివరిస్తాయి.
అలాంటి పురాణాల్లో భాగవతాన్ని మొదటిదానిగా పేర్కొన్నారు. దానికి గల కారణాన్ని పరిశీలిస్తే- ఇందులో చెప్పిన విషయాలు, కథలు, విశేషాలు మొదలైనవన్నీ భక్తి, జ్ఞాన, వైరాగ్యభరితాలే. వాటితోపాటు చతుర్విధ పురుషార్థాల్లోని ధర్మార్థకామాలను నిర్వర్తిస్తూ మోక్షప్రాప్తికి మార్గం చూపేవి. ఈ మూడింటినీ వివరించి ఎవరు ఏ మార్గంలో పయనించాలో నిర్ణయించుకునే స్వాతంత్య్రాన్ని వారివారి బుద్ధికుశలతకే వదిలేసి స్వేచ్ఛనిచ్చింది భాగవతం. అందుకే అది ఎక్కువ మంది చదివే పురాణం, అందునా వాటిలో మొదటిదైంది!
Comments