top of page
  • Black Facebook Icon
  • Black YouTube Icon
  • Black Instagram Icon
  • Black Pinterest Icon

శివుడు స్వయంభువుడుగా ఎలా పుట్టాడు?

  • Writer: B Ashok Kumar
    B Ashok Kumar
  • Jun 5, 2018
  • 2 min read


అమ్మ లాలనలో ప్రతి బిడ్డ ఏ ఆపదలు లేకుండా ఆనందంగా ఉంటాడు. తల్లి ఎప్పుడు తన బిడ్డ ఆయురారోగ్యాలతో కలకాలం సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. తనకు పుట్టిన బిడ్డపైన ఏ తల్లి అయినా అమిత ప్రేమను పెంచుకుంటుంది. కాని ఇక్కడ భగవంతునికే తల్లిగా మారి తన ప్రేమను ఎలా చూపించిందో తెలుసుకుందాం. అభవుడైన శివుని గూర్చి ఒక తల్లి ఆలోచనలో పడింది. శివుణ్ణి అభవుడు అంటారు కదా... అదేంటి.... ఆయనకు పుట్టుక లేదా.. ఏ తల్లి కడుపున పుట్టలేదా.... చాలా ఆశ్చర్యంగా ఉందే.


మరి శివుడు స్వయంభువుడుగా ఎలా పుట్టాడు... అంతా అయోమయంగా ఉంది అనుకుంది ఆమె. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా.. ఆమె బెజ్జమహాదేవి. ఆమె ముత్తవ్వగా, అమ్మవ్వగా శంకరుని చేతనే కీర్తించబడింది. నిత్యత్వాన్ని పొందింది. అమె లింగ పూజలు చేస్తున్నంత సేపు ఆమెలో తెలియని బాధ చోటుచేసుకుంది. శివుడు తల్లి చిన్నప్పుడే చనిపోయిందేమో.. అని బాధ పడింది. చివరకు బెజ్జమహాదేవికి తన ప్రశ్నకు సమాధానం దొరికింది.


బెజ్జమహాదేవి బాలపరమేశ్వరుని చేసుకొని అతనికి ఎన్నో సేవలు, ఎన్నెన్నో పరిచర్యలు చేసింది. ఒక్క క్షణం కూడా ఊరుకోకుండా బాలుడై ఒడిలో చేరిన లింగడికి సర్వోపచారాలు చేసింది. అవి ఉపచారాలు అని ఆమెకు తెలియదు. తల్లి లేని శివుడికి తల్లియై పసిబాలుని అలా పెంచాలన్నదే ఆమె ఆలోచన. శివునికి ఏ కొరత లేకుండా చేయాలి అన్నదే ఆమె కోరిక. శివుడు శిశివు రూపంలో ఉన్నాడు కదా.. ఆ శివుడికి నీళ్లు పోయటం దగ్గర నుంచి అన్ని పనులు చేయసాగింది.


ఆమె తన కాళ్లను బారచాపి పసి లింగ మూర్తిని కాళ్లపై వేసుకొని లాల పోచింది. కనుముక్కు తీరు సక్రమంగా ఉండాలని వాటిని చక్కగా వత్తి తీర్చిదిద్దింది. పొట్టను వత్తి బోర్లా పడుకోబెట్టి నీళ్ల దోసిళ్లతో చరచి వీపు నిమిరింది. ఇదంతా ప్రతి తల్లి తన బిడ్డల శారీరక ఎదుగుదలకు చేసేదే... అదే చేసింది ఈ తల్లి కూడా. ఉగ్గుపోసింది. పసివాడి మీద పక్షుల నీడ పడకుండా జాగ్రత్త చేసింది. పసివాడిని తన పొట్ట మీద పడుకోబెట్టి జోలపాడి నిద్ర పుచ్చింది. ఆ తల్లి నిశ్వార్ధ ప్రేమకు లొంగిపోయాడు భోళాశంకరుడు.


కైలాస నాధుడినే లాలించిన ఆ అమ్మను అనుగ్రహించే ముందు పరీక్షించాలనుకున్నాడు. అంతే... అంగిట ముల్లు రోగం తెచ్చుకున్నాడు. లింగమూర్తి పాలు త్రాగటానికి వెన్న తినటానికి నోరు తెరవటం లేదు. తల్లిపాలు కూడా త్రాగటం లేదు. ఆ తల్లి బాధ అంతాఇంతా కాదు. రకరకాల ప్రయత్నాలు చేసింది. నాయనా ఒక్కగానొక్క కొడుకువి కదరా... నీవు లేకపోతే నేను ఎలా జీవించాలి అని తల్లి ఎంతో బాధ పడింది. చివరకు ఆ తల్లి నీవు లేక జీవించలేను అంటూ తన ప్రాణం తీసుకోవటానికి నిర్ణయించుకుంది. తన తలను నరుక్కోపోయింది.


తల్లి ప్రేమను చూసి నిశ్చేష్టుడైన విటలాక్షుడు తటాలున సాక్షాత్కరించాడు. తల్లి ప్రేమను పరీక్షించి ఓడిపోయాడు. తల్లీ... నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. నాయనా నాకేం తక్కువ తండ్రి. నువ్వు ఏ రోగం లేకుండా ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంటే నాకంతే చాలు అని కోరుకుంది. తల్లి కోరికకు సదాశివుడు పరమానందభరితుడై నీ వంటి తల్లి ఉండగా రోగాలు ఎలా ఉంటాయి అమ్మ అంటూ తల్లిని అక్కున చేర్చుకున్నాడు. ముల్లోకాలకు తండ్రినైన నాకే తల్లివి గనుక నువ్వు ముత్తవ్వగా ప్రసిద్ధి చెందుతావు అని వరమిచ్చాడు.

Opmerkingen


PAGE VIEWS

JOIN MY MAILING LIST

Copyright © 2018 AADHYATMIKAM. All rights reserved.

bottom of page