సాలె పురుగు
- B Ashok Kumar
- Jun 11, 2018
- 2 min read

సృష్టిలో ఎనభై ఏడు లక్షల రకాల ప్రాణులున్నాయని పాశ్చాత్య శాస్త్రజ్ఞుల ప్రస్తుతపు అంచనా. జంతుజాతులు సుమారు డెబ్భై ఎనిమిది లక్షలు, వృక్షజాతులు సుమారు మూడు లక్షలు. ఇవికాక శిలీంధ్రాలు, సూక్ష్మజీవులు, క్రిములూ వంటివెన్నో.
ఈ ప్రాణులన్నీ తలా ఒక నీతికథలా మనిషికి ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో నేర్పుతాయి. ప్రకృతి విశ్వవిద్యాలయంలో ప్రాణులన్నీ మనిషికి పాఠాలు నేర్పగల ఆచార్యవర్గమే!
మనిషి జాతిని ప్రాణికోటిలో అగ్రస్థానంలో కూర్చోబెట్టింది- ఆ జాతికి ఉన్న తెలివి తేటలే అనేది నిర్వివాదాంశం. ఆ తెలివితేటల్లో అతి ముఖ్యమైనవి తెలియని విషయం నేర్చుకొనే శక్తి, నేర్చుకోవాలన్న జిజ్ఞాస. ప్రకృతి ప్రాణికోటిని మనిషికి బోధకులుగా మాత్రమే సృష్టించకపోయినా, సకల చరాచరాలను, స్థావరజంగమాలను తనకు గురువుగా భావించి, ప్రయోజం పొందే వివేకం మానవజాతికి ఉన్నది.
రాబర్ట్ బ్రూస్ స్కాట్లాండ్ దేశానికి రాజుగా ఉండే రోజుల్లో- బలవత్తరమైన పొరుగుదేశం ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మీద దండెత్తి విజయం సాధించింది. తన రాజ్యం తిరిగి గెలుచుకోవటానికి బ్రూస్ కొద్దిపాటి సైన్యంతో ఆరుసార్లు యుద్ధం చేసి ప్రతిసారీ ఘోరంగా ఓడిపోయాడు. ఒకరోజు అడవిలో పాడుబడ్డ కుటీరంలో పడుకొని పైకప్పు చూస్తూ తన దుస్థితి సమీక్షించుకొంటుండగా, ఒక సాలెపురుగు కనిపించింది. అది గూడుకోసం ఒక దూలం నుంచి మరొక దూలం దాకా దారపుపోగు లాగే ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నంలో ఆ అల్పజీవి ఆరుసార్లు విఫలమైంది. తన కంటే అధ్వానంగా ఉన్న దాని అవస్థ చూసి బ్రూస్‌కు గుండె కరిగిపోయింది. సాలెపురుగు మాత్రం ఉత్సాహం వదలకుండా, ఏడోసారి ప్రయత్నించి విజయం సాధించింది. రాజు ఏడోసారి ఇంగ్లాండ్ సైన్యం మీద దాడిచేసి తన రాజ్యం తిరిగి గెలుకోవడం- పాశ్చాత్య దేశాల్లో అందరికీ స్ఫూర్తిదాయకమైన కథగా ఈ నాటికీ నిలిచిఉంది.
సాలీడు (లూత, చెలది, చెలగం, శ్రీ, ఊర్ణనాభి అని దీనికి పర్యాయపదాలు) చిన్న కీటకాలను పట్టి తినేందుకు వల పన్నుతుంది. గూడు కట్టడంలో, వల పన్నడంలో ఎంతో ఓర్పును, నేర్పును, సృజనాత్మకతను చూపుతుంది. మనిషికున్నంత పెద్ద శరీరం, మెదడు వాటికి లేవుగానీ, ఉంటే- సాలీళ్ళు... ఎన్ని తాజ్‌మహళ్లు కట్టి చూపేవో!
మనిషికి సాలెపురుగు ఆధ్యాత్మిక మార్గదర్శనం కూడా చేసే కథ ‘కాళహస్తి మాహాత్మ్యం’ కావ్యంలో కనిపిస్తుంది. స్వర్ణమణీ తీరంలో మారేడు చెట్టు మీద ఒక సాలెపురుగు ఉండేది. ఒక రోజు ఓ భక్తుడు శివపూజ కోసం మారేడు దళాలు కోసుకొని సమీపంలో శివాలయానికి తీసుకెళ్ళాడు. ఆ దళాలను అంటిపెట్టుకొని ఉన్న సాలె పురుగూ యాదృచ్ఛికంగా శివాలయానికి చేరింది. శివుడి దర్శనం కాగానే పూర్వజన్మల సంస్కారం వల్ల శివభక్తి తత్పరమైపోయింది. ‘దేవా! నేను అల్పప్రాణిని. స్తుతులు, స్తోత్రాలు రావు. వేదశాస్త్రాలు తెలియవు. తెలిసి ఉంటే, అనాది మధ్యలయుడివైన నీ తత్వం వాటి ద్వారా బోధపడేది కాదు గదా! అందుకే నాకు చేతనైన కైంకర్యం చేసి, నీ పాదాలు కొలుచుకొంటాను!’ అన్న భావనతో తన తంతువులతో స్వామి కళ్ళెదుట అందమైన ప్రాకారాలు, గోపురాలు, అంతఃపురాలు, క్రీడాశాలలు, మండపాలు కట్టిపెట్టింది.
దాన్ని పరీక్షించేందుకు ఆ కాళహస్తీశ్వరుడు ఆలయ దీపాల జ్వాలలతో సాలీడు సృష్టినంతా అగ్గిపాలు చేశాడు. దాంతో అదుపులేని ఆగ్రహంతో సాలీడు దీపాన్ని మింగేయడానికి పైకి దూకింది. శివుడు దాని భక్తికి మెచ్చుకొని దాన్ని తన చేతులతో రక్షించి, తనలో చేర్చుకొని శివసాయుజ్యం ప్రసాదించాడు.
భగవంతుడు భక్తి శ్రద్ధలకు వశుడవుతాడుగాని, భాషాజ్ఞానానికి, బాహ్యాటోపాలకు లొంగడని చెలది కథ చెప్పే నీతి. అహంకారం, అవినయం, అన్యులను చులకన చేయడం బుద్ధిశాలుల లక్షణాలు కావు. బుద్ధిహీనతకు తార్కాణాలు అని శాస్త్రాలు బోధిస్తాయి. ప్రకృతి ప్రతి రోజూ, ప్రతి ప్రాణి ద్వారా మనకు నేర్పే పాఠం కూడా ఇదే!
Commentaires